ఢాకా: దేశద్రోహం ఆరోపణలపై ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న హిందువులపై పోలీసులు కాల్పులు జరపడం ఉద్రిక్తతకు దారి తీసింది. హిందూ సంస్థ సమ్మిళిత సనాతన నేత అయిన బ్రహ్మచారిని హజ్రత్ విమానాశ్రయ సమీపంలో అరెస్ట్ చేసి, అనంతరం చిట్టగ్యాంగ్కు తీసుకువచ్చారు. అక్టోబర్ 25న బ్రహ్మచారి ఒక ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానపర్చారంటూ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత ఖలీదా జియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ ఇవ్వడానికి మంగళవారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.
చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ వేలాది మంది కోర్టు ప్రాంగణానికి చేరుకుని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను జైలుకు తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో ఆయన న్యాయవాది సైఫుల్ ఇస్లామ్ మృతి చెందారు. చిట్టగాంగ్, ఢాకాలలోనూ వందలాది మంది హిందువులు ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మచారి అరెస్ట్‌ను భారత విదేశాంగ శాఖ, బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది.