కొలంబో, ఏప్రిల్ 19: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో నలిగిపోతున్న శ్రీలంక.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్నది. రాజధాని కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంధన ధరల తాజా పెంపు ను నిరసిస్తూ నైరుతి ప్రాంతంలోని రంబుక్కన పట్టణంలో నిరసన చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 12 మందికి గాయాలయ్యాయ. ఆందోళనల్లో చోటుచేసుకున్న తొలి మరణం ఇదే. హింసాత్మక ఘటనల తర్వాత పట్టణంలో కర్ఫ్యూ విధించారు. సోమవారం ప్రారంభమైన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు మంగళవారం పట్టణంలోని ఓ రైల్వే ట్రాక్‌ను దిగ్భందించారు. ఈ సందర్భంగా వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. వెళ్లిపోవాలని కోరినా ఆందోళనకారులు వినలేదని, బలగాలపై రాళ్లు రువ్వారని పోలీసులు పేర్కొన్నారు. ఆయిల్ ట్యాంకర్, మరో వెహికిల్‌కు నిప్పంటించేందుకు యత్నించారని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మొదట టియర్‌గ్యాస్, తర్వాత కాల్పులు జరిపామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరిస్తాం
ప్రజాగ్రహానికి శ్రీలంక ప్రభుత్వం అంశాలవారీగా దిగొస్తున్నది. రాజపక్స కుటుంబీకులు ఎవరూ లేకుండా ఇప్పటికే కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయగా, తాజాగా ప్రధాని మహింద రాజపక్స మరో కీలక ప్రకటన చేశారు. అధ్యక్షుడి అధికారాలు తగ్గించి, పార్లమెంట్‌కు కల్పించేందుకు 19 రాజ్యాంగ సవరణ(19ఏ)ను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అధ్యక్ష అధికారాలకు కత్తెర వేస్తూ అధ్యక్షుడి కంటే పార్లమెంట్‌కు అధిక అధికారాలు ఇచ్చే 19ఏ సవరణను 2015లో ఆమోదించారు. అయితే గొటబయ రాజపక్స 2019 డిసెంబర్లో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత దాన్ని రద్దు చేశారు.
ట్రిపుల్ సెంచరీ దాటిన పెట్రోల్ ధర
శ్రీలంకలో పెట్రోల్ ధర ట్రిపుల్ సెంచరీ దాటింది. సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్ తాజాగా పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్‌పై 33.1 శాతం పెంచగా, ప్రస్తుతం లీటర్ ధర ఏకంగా రూ.338లకు (శ్రీలంక రూపాయలు) ఎగబాకింది. ఇక డీజిల్‌పై 64.2 శాతం పెంచగా, ప్రస్తుత ధర రూ.289కు చేరింది.