లండన్: బ్రిటన్ రాజు చార్లెస్-3 జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణానంతరం కింగ్ చార్లెస్ కామన్వెల్త్ దేశాలకు సందేశాన్ని వినిపించారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని బ్లూ డ్రాయింగ్ రూమ్‌లో ప్రీ రికార్డ్ చేసిన వీడియోను ప్రసారం చేశారు. చాలా భారమైన హృదయంతో మాట్లాడుతున్నానని, జీవితాంతం, మా అమ్మ.. మహారాణి.. తనకు ప్రేరణగా నిలిచిందని, తనకు, తన కుటుంబానికి ఆమె ఓ ఉదాహరణగా నిలిచిందన్నారు. ఆమె ప్రేమ, అనురాగం, మార్గదర్శనం, అన్నింటికి ఆమెకు రుణపడి ఉన్నట్లు కింగ్ చార్లెస్ తెలిపారు. 21 ఏళ్ల వయసులో.. 1947లోనే కేప్‌టౌన్ నుంచి కామన్వెల్త్ దేశాలను ఉద్దేశించి తన తల్లి మాట్లాడారని, స్వల్ప కాలమైనా, సుదర్ఘీ కాలమైనా.. ప్రజల జీవితం కోసం అంకిత భావంతో పనిచేయనున్నట్లు చెప్పిందని ఛార్లెస్ గుర్తు చేశారు. వాగ్దానం కన్నా ఎక్కువే తన తల్లి సేవ చేసిందని, తన జీవితానికి ఎంతో కట్టుబడి ఉందని, తన విధుల కోసం ఎన్నో త్యాగాలను చేసినట్లు ఛార్లెస్ తెలిపారు. ఆమె అంకితభావం, భక్తి.. సౌర్వభౌమత్వానికి ఎన్నడూ ఆటంకం కాలేదన్నారు. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఆమె ప్రజా జీవితాన్ని కొనసాగించినట్లు చెప్పారు. మై డార్లింగ్ మామ అంటూనే తల్లి దివంగత మహారాణి ఎలిజబెత్‌కు థ్యాంక్స్ తెలిపారు.