King Charles | బ్రిటన్ రాజు చార్లెస్- 3 తన పరోక్షంలో రాజరిక విధులు నిర్వర్తించకుండా ప్రిన్స్ హరీని తప్పించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం ప్రిన్స్ హర్రీ మాత్రమే కాదు ప్రిన్స్ ఆండ్రూ, ఆయన కూతురు ప్రిన్సెస్ బిట్రెస్లను రాజరిక విధుల నుంచి తప్పించనున్నారని, అందుకు చట్టానికి సవరణలు తీసుకొస్తారని తెలుస్తున్నది. రాజు విధులు నిర్వర్తించలేని సమయంలో పూల్ ఆఫ్ రాయల్స్ జాబితాను విస్తృత పరిచేందుకు ప్లాన్ సిద్ధమైందని సమాచారం. కింగ్ చార్లెస్-3 పరోక్షంలో వివిధ పత్రాలపై సంతకాలు చేయడం, వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలకు స్వాగతం పలుకడం వంటి కార్యక్రమాలను పూల్ ఆఫ్ రాయల్స్‌లో గల రాజరిక కుటుంబ సభ్యులు నిర్వర్తిస్తారు.
రాజరిక కుటుంబంలో 21 ఏండ్లు దాటిన వారిలో నలుగురు పెద్దవారు స్టేట్ కౌన్సిలర్లుగా వ్యవహరిస్తారని 1937 రీజెన్సీ యాక్ట్ చెబుతున్నది. ప్రస్తుతం ఈ జాబితాలోకి ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హర్రీ, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్సెస్ బీట్రైస్ ఉన్నారు. తన సోదరుడు ఎడ్వర్డ్, సోదరి అన్నెలకు పూల్ ఆఫ్ రాయల్స్‌లో చోటు కల్పిస్తూ చట్టానికి సవరణలు చేయనున్నారు. కొన్ని వారాల్లోనే బ్రిటన్ పార్లమెంట్‌కు ఈ చట్ట సవరణ పూర్తి చేయనున్నట్లు రాజ కుటుంబ వర్గాల కథనం. అయితే దీనిపై అధికారికంగా స్పందించేందుకు బకింగ్‌హం ప్యాలెస్ నిరాకరించింది. ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 పరోక్షంలో ఆయన భార్య కెమిల్లా, వారసులు ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ ఆండ్రూ, ఆయన కూతురు బిట్రైస్లు మాత్రమే రాజరిక విధులు నిర్వర్తించేందుకు వీలు ఉంది.
బిట్రైస్ ప్రస్తుతం వర్కింగ్ రాయల్‌గా లేరు. దోషిగా తేలిన పైడోఫిలే జెఫ్రీ ఇప్స్టైన్తో స్నేహం, మైనర్‌తో అక్రమ సంబంధం వంటి కారణాలతోప్రజా జీవితం నుంచి ఆండ్రూ రిటైర్ అయ్యారు. ఇక ప్రిన్స్ హర్రీ తనకు తాను వర్కింగ్ రాయల్ హోదాను వదులుకుని తన భార్యతో కలిసి అమెరికాలో జీవిస్తున్నారు. కింగ్ చార్లెస్-3తోపాటు రాజరిక ప్రతినిధుల నియామకం జరిగితే హర్రీ, ఆండ్రూ, బీట్రైస్లను రాయల్ ప్యాలెస్ పక్కకు తప్పించేందుకు వీలవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కింగ్ చార్లెస్-3కి మరింత ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యం అని రాయల్ ప్యాలెస్ వర్గాలు చెప్పాయని డైలీ ఎక్స్‌ప్రెస్ రాయల్ రిపోర్టర్ రిచర్డ్ పాల్మేర్ ట్వీట్ చేశారు.