Xi Jinping : అమెరికా-ఉత్తరకొరియా (US-North Korea) దేశాల మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంపై దాడికి వీలుగా కిమ్ ప్రభుత్వం (Kim govt) క్షిపణి ఇంజిన్లు, అణు ఆయుధాలను పరీక్షించడంతో ఆ ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య చైనా అధ్యక్షుడు (China President) జీ జిన్‌పింగ్ (Xi Jinping) మధ్యవర్తిత్వం వహించబోతున్నట్లు తెలిసింది. ఈ మేరకు దక్షిణకొరియా (South Korea) మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వచ్చే వారం ఉత్తరకొరియా పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైనా సెక్యూరిటీ, ప్రొటోకాల్ బృందాలు ఆ దేశంలో పర్యటించాయి. ఇరుదేశాల సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటన జరగనుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరకొరియా ప్రస్తుతం అణు నిరాయుధీకరణ చర్చలకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఏదైనా దాడుల్లో కిమ్ మరణిస్తే.. తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తరకొరియా తన విధానాలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా- ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్‌పై తొలిరోజు జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేకమంది సీనియర్ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరకొరియా తమకు అదే జరగవచ్చునన్న ముందస్తు అంచనాతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ అనుసరించబోయే ఈ నూతన విధానాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్ ఉత్తరకొరియా పర్యటన జరుగుతోంది. ఆంక్షలతో సతమవుతోన్న కిమ్ రాజ్యానికి చైనా నుంచి ఆర్థికసహాయం అందుతోంది.
ఈ క్రమంలోనే తమ మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు రెండు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రాంతీయ అస్థిరతలకు చెక్ పెట్టే దిశగా.. ట్రంప్, కిమ్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు జిన్‌పింగ్ ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. కాగా గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరకొరియా విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించారు. 2019లో వియత్నాంలో ట్రంప్-కిమ్‌జోంగ్ ఉన్ భేటీ అయ్యారు. కానీ అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తరకొరియా వెనక్కి తగ్గకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.