టెహ్రాన్, జూన్ 22: ఒక వేళ తాను మరణిస్తే తన వారసులుగా ముగ్గురు సీనియర్ మతాధికారుల పేర్లను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిపాదించారని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ కనుక మరణిస్తే 88 సభ్యుల మతాధికారుల సంస్థ అయిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నేతృత్వంలో వారసుని ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత, ఖమేనీని వారసుడిగా ఎంపిక చేసిన 1989లో ఒకే ఒక్కసారి మాత్రమే ఈ విధానాన్ని వినియోగించారు. గత శుక్రవారం ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ను పరిరక్షించడానికి ఖమేనీ అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు.
ఖమేనీ కుమారుడు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో దగ్గర సంబంంధాలున్న మతాధికారి, ఇరాన్ చీఫ్గా తదుపరి బాధ్యతలు చేపడతారని ప్రచారంలో ఉన్న మొజతాబా ఖమేనీ మాత్రం ఆయతొల్లా ఖమేనీ ఎంపిక చేసిన వారసులలో లేరని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాగా, ఖమేనీ వారసుడిగా భావించిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ 2024లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.