Khalistanis | ఒట్టావా, మే 5: కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తాజాగా హిందువులను దేశం నుంచి వెనక్కి పంపాలంటూ వారు విష ప్రచారం మొదలుపెట్టారు. కెనడాలోని 8 లక్షల మంది హిందువులను దేశం నుంచి వెళ్లగొట్టాలంటూ వేర్పాటువాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భారత ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోనులో పెట్టి ప్రదర్శించారు.
ఇటీవల ఖలిస్థానీ మద్దతుదారులు ఓ గురుద్వారా, ఓ హిందూ ఆలయంలో విధ్వంసం సృష్టించారు.కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిందా ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన మాత్రమే కాదు. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత ఇది. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణం’ అని పేర్కొన్నారు. ఆయన కనిష్క బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు రాశారు.