PM Keir Starmer | లండన్, జూలై 5: యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ పరాజయం పాలయింది. దీంతో 14 ఏండ్ల ఆ పార్టీ పాలనకు తెరపడింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లతో కూడిన యూకేలో గురువారం పోలింగ్ జరుగ్గా.. శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యాయి. 650 మంది సభ్యులు ఉండే హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 412 స్థానాలను కైవసం చేసుకుంది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. లిబరల్ డెమోక్రాట్లు 71 స్థానాల్లో విజయం సాధించగా, మిగతా పలు పార్టీలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. లేబర్ పార్టీ 33.7 శాతం ఓట్లను సాధించగా.. కన్జర్వేటివ్ పార్టీ 23.7% ఓట్ షేర్ దక్కించుకొన్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో యూకే తదుపరి ప్రధానిగా కీర్ స్టార్మర్ నియమితులయ్యారు. కింగ్ చార్లెస్-3 ఆయన నియామకాన్ని ఆమోదించారు. రాజును కలిసిన అనంతరం యూకే ప్రధాని హోదాలో కీర్ స్టార్మర్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని, మార్పు కోసం పనిని వెంటనే ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రిషి సునాక్ అంతకుముందు ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద చివరి ప్రసంగం చేసి, కింగ్ చార్లెస్‌ను కలిసి తన రాజీనామా పత్రం సమర్పించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని, కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్టు పేర్కొన్నారు. రిషి సునాక్ ఉత్తర ఇంగ్లండ్‌లోని ఓన్ రిచ్బండ్ అండ్ నార్త్ అల్లర్టన్ స్థానం నుంచి 23 వేల ఓట్లతో గెలిచారు.
61 ఏండ్ల కీర్ స్టార్మర్ మానవ హక్కుల న్యాయవాది. చాలా కాలం లాయర్‌గా పనిచేసి, రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2015లో లండన్ నుంచి లేబర్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే పార్టీ పగ్గాలు అందుకున్నారు. సరికొత్త లేబర్ పార్టీని ఆవిష్కరించారు. జెరెమీ కార్బిన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కశ్మీర్‌పై ఓ తీర్మానం చేశారు. అంతర్జాతీయ పరిశీలకులు కశ్మీర్లో పర్యటించాలని, కశ్మీరీలకే సొంత నిర్ణయాధికారం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే స్టార్మర్ బాధ్యతలు చేపట్టాక కశ్మీర్‌పై పార్టీ విధానంలో మార్పు తీసుకొచ్చారు. కశ్మీర్ భారత్, పాక్‌కు సంబంధించిన విషయని, విదేశీ జోక్యం తగదని పేర్కొన్నారు.
నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కీర్ స్టార్మర్ జాతినుద్దేశించి మాట్లాడుతూ యూకేను పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ‘మా పని అత్యవసరం, దాన్ని ఈరోజే ప్రారంభిస్తున్నాం’ అని పేర్కొన్నారు. మార్పు కోసం ప్రజలు ఓటేశారని అన్నారు. తాను మాటలు చెప్పనని, పనిచేసి చూపిస్తానని ఈ సందర్భంగా స్టార్మర్ పేర్కొన్నారు.
యూకే ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్‌ను నూతన ప్రధాని కీర్ స్టార్మర్ నియమించారు. యూకే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఈమెనే కావడం గమనార్హం. రాచెల్ రీవ్స్ ఓ మాజీ చైల్డ్ చెస్ చాంపియన్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె.. గతంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఆర్థికవేత్తగానూ పనిచేశారు. ఆర్థిక మంత్రిగా నియమితులైన నేపథ్యంలో బలమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి కృషి చేస్తానని రాచెల్ రీవ్స్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. రాచెల్ రీవ్స్ 2010లో తొలిసారి ఎంపీ అయ్యారు.
ప్రధానిగా చివరి ప్రసంగం సందర్భంగా రిషి సునాక్ భావోద్వేగానికి గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘ముందుగా మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. ప్రధానిగా నా బాధ్యతను పూర్తిస్థాయిలో ఏ లోటు లేకుండా నిర్వర్తించానని అనుకొంటున్నా. కానీ, యూకేలో ప్రభుత్వం కచ్చితంగా మారాల్సిందేనని మీరు(ప్రజలు) సంకేతం ఇచ్చారు. మీ ఆగ్రహం, అసంతృప్తి నాకు వినిపించింది’ అంటూ రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తిని చూస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రధానిగా తన హయాంలో దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించానని, యూకేను ఒక సురక్షితమైన, బలమైన దేశంగా చేశానని పేర్కొన్నారు.
యూకే సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 28 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలుగా గెలిచారు. కన్జర్వేటివ్ పార్టీ తరపున తమ సీట్లను తిరిగి నిలబెట్టుకొన్న వాళ్లలో ప్రీతి పటేల్, సుయేల్లా బ్రేవర్మన్, గగన్ మోహింద్రా, శివానీ రాజా తదితరులు ఉన్నారు. లేబర్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో భారత సంతతి వ్యక్తులు గెలిచారు. ఈ జాబితాలో సీమా మల్హోత్రా, ప్రీత్ కౌర్ గిల్, తన్మజీత్ సింగ్ తదితరులు ఉన్నారు. జాస్ అథ్వాల్, బగ్గీ శంకర్, సత్వీర్ కౌర్, కనిష్క నారాయణ్ తదితరులు తొలిసారిగా ఎంపీలుగా ఎన్నికయ్యారు. యూకే ఎన్నికల బరిలో దిగిన ఇద్దరు తెలుగు వ్యక్తులు ఓడిపోయారు. లేబర్ పార్టీ తరపున నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పోటీచేసిన రచయిత ఉదయ్ నాగరాజు దాదాపు 5 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ తరపున స్టోక్ ఆన్ ట్రెండ్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన మరో తెలుగు వ్యక్తి చంద్ర కన్నెగంటి దాదాపు 6 వేల ఓట్లు మాత్రమే దక్కించుకొని మూడో స్థానానికి పరిమితమయ్యారు.