వాషింగ్టన్: అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) నూతన డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ (Kash Patel) ప్రమాణ స్వీకారం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ భగవద్గీతపై ప్రమాణం చేశారు. వైట్‌హౌస్ ఆవరణలో ఉన్న ఐసన్హావర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలోని ఇండియన్ ట్రీటీ రూమ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పటేల్ స్నేహితురాలు, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఇకపై ఎఫ్‌బీఐ లోపల, వెలుపల జవాబుదారీతనం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
కాగా, కాష్ పటేల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. కాష్ కఠినమైన, బలమైన వ్యక్తి అని ప్రశంసించారు. ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆయనను ఎంతో గౌరవిస్తారని, కాష్ను డైరెక్టర్‌గా ఎంపిక చేయడానికి ఇదీ ఒక కారణమని చెప్పారు. ఈ పదవిని చేపట్టిన అత్యుత్తమ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని వెల్లడించారు. ఆయన నియామకం కోసం చాలా సులువుగా ఏకాభిప్రాయం సాధించగలిగానని తెలిపారు.
కాగా, ఎఫ్‌బీఐ తొమ్మిదవ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన నియామకానికి అమెరికన్ సెనేట్ గురువారం ఆమోదించింది. పటేల్ నియామకానికి అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. ఇద్దరు డెమోక్రాట్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
కాష్ పటేల్‌లో అమెరికాలోని న్యూయార్క్‌లో గల గార్డెన్ సిటీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు ఇండియాలోని గుజరాత్‌కు చెందిన వారు. కాష్ తల్లిదండ్రులు తొలుత ఉగాండాకు వెళ్లినప్పటికీ అక్కడ జాతి వివక్ష కారణంగా కెనాడాకు వెళ్లిపోయారు. కాష్ తండ్రి విమానయాన సంస్థ ఉద్యోగ రిత్య అమెరికాలో స్థిరపడ్డారు. కాష్ పటేల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. కాష్ రిచ్మండ్ యూనివర్సిటీ నుంచి హిస్టర్, క్రిమినల్ జస్టిస్‌లో డిగ్రీ పొందారు. అలాగే పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జేడీ కూడా పొందారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా, ఎన్ఎస్సీ(నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్)లో ఉగ్రవాద నిరోధన విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు.