వాషింగ్టన్: డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అయితే ఆమెను ఓడించడం మరింత సులువని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. అధ్యక్ష పదవి రేస్ నుంచి జో బైడెన్ తప్పుకున్న తర్వాత ఆయన స్పందించారు. బైడెన్ కంటే కమలా హారిస్ (Kamala Harris)ను ఓడించడం ఇంకా సులభమని ధీమా వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అంటూ ఫైర్ అయ్యారు.
అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ (Joe Biden) తగినవాడు కాదని చెప్పారు. ఆ హోదాలో పనిచేసే అర్హత ఆయనకు ఏనాడూ లేదు. అతను కేవలం అబద్ధాలు, తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా అధ్యక్ష పదవిని పొందారు. మీడియా, వైద్యులు సహా చుట్టూ ఉన్న అందరికీ ఆయన అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని తెలుసు. ఆయన పాలన వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నా. వాటిని వీలైనంత త్వరగా చక్కబెడతామన్నారు.
అధ్యక్ష ఎన్నికల బరి నుంచి డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. దేశంతోపాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొంటున్నట్టు 81 ఏండ్ల బైడెన్ ఆదివారం ప్రకటించారు. దేశాధ్యక్షుడిగా 2025, జనవరి వరకు ఉన్న తన పూర్తి పదవీ కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. గత నెల ట్రంప్‌తో జరిగిన డిబేట్లో తడబాటు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. దేశానికి అధ్యక్షుడిగా సేవలు అందించడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ‘తిరిగి ఎన్నిక కావాలనేది నా ఉద్దేశం. అయితే దేశం, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నా. మిగతా పదవీ కాలం అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించడంపై దృష్టి పెడుతా’ అని అన్నారు.
తప్పుకోవాలని పెద్దయెత్తున డిమాండ్లు
అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నుంచే పెద్దయెత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్లలో తడబాటు, పలు సందర్భాల్లో వింత ప్రవర్తన, ట్రంప్‌నకు పోటీ ఇవ్వలేరన్న అంచనాల నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి, డిమాండ్లు పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించే కంటే ముందు బైడెన్ ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.
చర్చనీయాంశంగా బైడెన్ తడబాటు
బైడెన్ ప్రవర్తనా శైలి, పలు సందర్భాల్లో మాటల తడబాటు ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ‘ప్రెసిడెంట్ పుతిన్’గా సంబోధించారు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి జెలెన్స్కీ ప్రెసిడెంట్ పుతిన్‌ను ఓడించబోతున్నారని తెలిపారు. ఈ సమావేశం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ మళ్లీ తడబడ్డారు. ‘ఆమెకు అధ్యక్షురాలయ్యే అర్హత లేదని నేను అనుకొని ఉంటే ట్రంప్‌ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసి ఉండను’ అని అన్నారు. బైడెన్ మాటలకు తెల్లబోవడం అక్కడున్న డెమొక్రటిక్ పార్టీ అగ్రనేతలు వంతయింది. అధ్యక్ష అభ్యర్థిగా ఓ వైపు తనకు వ్యతిరేకంగా గళాలు పెరుగుతున్నప్పటికీ, అధ్యక్ష పోటీ నుంచి తప్పుకొనేలా లేదని బైడెన్ ఇంత వరకూ చెప్పుకొచ్చారు. తనపై వ్యతిరేక ప్రచారానికి ముగింపు పలకాలని ఆయన పార్టీ వర్గాలను కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ సహచరులకు రెండు పేజీల లేఖ కూడా రాశారు.
ట్రంప్‌తో డిబేట్ నుంచి మొదలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గత నెల 27న జరిగిన ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ వెనుకబడిన నాటి నుంచి ఆయనపై పార్టీలో వ్యతిరేకత పెరిగింది. బైడెన్ మానసికంగా ధృడంగా లేరని, ట్రంప్‌నకు ఆయన సరైన పోటీ ఇవ్వలేరన్న వాదనలతో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పార్టీలో వచ్చాయి. అట్లాంటాలోని సీఎన్ఎన్ హెడ్‌క్వార్టర్స్‌లో దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన డిబేట్లో ట్రంప్‌దే పైచేయిగా కనిపించింది. బైడెన్ తడబడుతూ మాట్లాడటంతో ఆయన పార్టీ ఆందోళనకు గురైంది. ఈ డిబేట్లో ట్రంప్ ఘాటుగా, సూటిగా మాట్లాడేసరికి, బైడెన్ నోటి నుంచి మాటలు నెమ్మదిగా, నీరసంగా వచ్చాయి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, విదేశాలతో సంబంధాలు, వలసల గురించి బైడెన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ, ట్రంప్ వ్యాఖ్యలు అతిశయోక్తులు, అబద్ధాలని చెప్పారు.