కాబూల్, ఆగస్టు 12: అది పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని ఫరాహ్ నగరం. అక్కడి వీధిలోని ఓ రహదారి రుధిర వర్ణాన్ని సంతరించుకున్నది. ఆఫ్ఘన్ భద్రత దళ సభ్యుడు ఒకరిని అత్యంత కర్కశంగా చంపిన తాలిబన్లు.. రక్తంలో తడిసిన అతడి మృతదేహాన్ని వీధులవెంట లాక్కెళ్తున్నారు. అక్కడే ఉన్న ఆఫ్ఘన్ భద్రతా దళాలు వారిని అడ్డుకునే సాహసాన్ని కూడా చేయలేకపోయాయి. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన ఆఫ్ఘన్‌లోని ప్రస్తుత పరిస్థితులకు అద్దంపడుతున్నది. దేశంలోని కీలక నగరాలను అత్యంత వేగంగా ఆక్రమిస్తున్న తాలిబన్లు.. ఆఫ్ఘన్‌లోని మూడింట రెండొంతుల ప్రాంతాలను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారు. తాలిబన్ల ధాటికి తాళలేని ఆఫ్ఘన్ సర్కారు సంధి చేసుకోవడానికి ముందుకొచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సంధి ఒప్పందంపై తాలిబన్లు విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న తాలిబన్లను నిలువరించడంలో అక్కడి ప్రభుత్వం క్రమంగా ఓటమి అంచుల్లోకి వెళ్తున్నది. దీంతో అధికారం కోసం తాలిబన్లు సృష్టిస్తున్న హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో కతార్‌లోని దోహాలో జరుగుతున్న సదస్సులో గురువారం ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ‘దేశంలో తాలిబన్లు ఘర్షణ వాతావరణానికి ముగింపు పలుకాలి. దీనికి ప్రతిగా దేశ బాధ్యతలను కొంతకాలంపాటు అప్పగిస్తాం. ఇది పవర్ షేరింగ్ డీల్ అనుకోవచ్చు’ అని ఆఫ్ఘన్ ప్రభుత్వానికి చెందిన అధికారి ఒకరు ప్రతిపాదనను తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మరికొద్ది రోజుల్లో సమస్త ఆఫ్ఘన్ భూభాగం తమ వశంకానున్న నేపథ్యంలో ‘పవర్ షేరింగ్ డీల్’కి సమ్మతించాల్సిన అవసరం తమకులేదని తాలిబన్ల అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
రాజధానితో సంబంధాలు కట్
ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లోని తొమ్మిది ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించిన తాలిబన్లు గురువారం కొత్తగా ఘాజ్నీ , హేరట్ ప్రావిన్సులను తమ ఖాతాలో వేసుకున్నారు. తాజా ఆక్రమణతో దేశంలో మూడింట రెండొంతుల భాగం తాలిబన్ల చెరలోకి వెళ్లినట్లయింది. భద్రత బలగాలు ఎక్కడా వారికి ఎదురు నిలవలేకపోతున్నాయి. పరిమితంగా ఉన్న అమెరికా సైన్యం అక్కడక్కడా వైమానిక దాడులు జరుపుతున్నప్పటికీ, అవేమీ తాలిబన్లను నిలువరించలేకపోతున్నాయి. కాగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను దక్షిణ ప్రావిన్సులను కలిపే కీలక రహదారి ఘాజ్నీ గుండాపోతున్నది. తాజాగా ఈ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో దక్షిణ ప్రావిన్సులతో రాజధానికి సంబంధాలు తెగిపోయినట్టు అయింది. మరోవైపు, ఆఫ్ఘన్ సైన్యానికి భారత్ బహూకరించిన ఎంఐ-24 హెలికాఫ్టర్‌ను తాలిబన్లు నియంత్రణలోకి తీసుకున్నట్టు సమాచారం.