వాషింగ్టన్, అక్టోబర్ 11: బాల భీముడి లాంటి ఆకారంతో అమెరికాలో ‘జంబో బేబీ బాయ్’ జననం..అక్కడి డాక్టర్లను, ఇతర వైద్య నిపుణులను సైతం ఆశ్చర్యపర్చింది. ఇక్కడి టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేకు చెందిన షెల్బీ మార్టిన్ అనే మహిళ భారీ ఆకారంతో కూడిన 5.8 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చారు. ఈ ఘటన ఆమె ప్రసవించిన దవాఖాన ‘ట్రైస్టార్ సెంటినియల్ దవాఖాన’లో కొత్త రికార్డు సృష్టించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సోషల్‌మీడియా, ఆన్లైన్లో వైరల్ అయ్యింది.
ప్రసవం అనంతరం తల్లి, బిడ్డ ఆరోగ్యం గురించి నర్సులు, వైద్యులు ఎంతగానో టెన్షన్ పడ్డారట. భారీ ఆకారం, బరువుతో శిశు జననాలకు వైద్యుల సంరక్షణ, వైద్య సేవల ప్రాముఖ్యతను ఇది తెలుపుతున్నదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అత్యంత సంక్లిష్టమైన ఈ తరహా శిశు జననాల్లో వైద్య నిపుణుల అంకితభావాన్ని మనకు గుర్తుచేస్తున్నదని అన్నారు. షెల్బీ మార్టిన్ ప్రెగ్నెన్సీ సమయంలో..భారీ ఆకారంతో ఉన్న తన ‘బేబీ బంప్’ను టిక్‌టాక్ వీడియోలతో పంచుకున్నారు.
ఇది కాస్తా పెద్ద సంచలనంగా మారింది. 44లక్షలమంది ఆమె వీడియోలను చూసి స్పందించారు. సోషల్‌మీడియాలో చాలామంది యూజర్లు ముందు నమ్మలేదు. అనేకమంది ఈ విషయాన్ని నవ్వులాటగా తీసిపారేశారు. దాదాపు 9 నెలలకుపైగా ‘బేబీ బంప్’తో ఆమె ఎదుర్కొన్న అనుభవాలపై అనేకమంది నెటిజన్లు స్పందించారు. అసాధారణమైన శిశు జనాల్లో సవాళ్లను అర్థం చేసుకునేందుకు ఆమె చెప్పిన విషయాలు దోహదపడ్డాయి.