న్యూయార్క్: అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన జిమ్మీ కిమ్మెల్(Jimmy Kimmel) లేట్ నైట్ టాక్ షోను అకస్మాత్తుగా రద్దు చేశారు. ఏబీసీ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. అయితే ఛార్లీ కిర్క్ అనుమానిత కిల్లర్ గురించి ఆ షోలో వివాదాస్పద కామెంట్ చేవారు. దీంతో ఆ షో ప్రసారాలపై ప్రభుత్వం వత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిమ్మీ కిమ్మెల్ లైవ్ షోను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు ఏబీసీ ప్రతినిధి తెలిపారు. అయితే మళ్లీ ఎప్పటి నుంచి ఆ టాక్ షో ప్రారంభం అవుతుందో ఇంకా స్పష్టంగా తెలియదు.
ఏబీసీ ఛానల్ ప్రసారాలకు లైసెన్స్ ఇస్తున్న లోకల్ స్టేషన్లపై ట్రంప్ సర్కారు ఒత్తిడి తేవడంతో జిమ్మీ కిమ్మెల్ షోను రద్దు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి హాలీవుడ్లో ఆ షో కోసం ప్రిపేరవుతున్న సమయంలో దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. షోను రద్దు చేసిన ఏబీసీ ఛానల్‌కు అధ్యక్షుడు ట్రంప్ మెచ్చుకున్నారు. మీరు చూపిన ధైర్యానికి కంగ్రాట్స్ చెబుతున్నట్లు ఆయన తన ట్రుత్ సోషల్‌లో పోస్టు చేశారు.
ఛార్లీ కిర్క్ గురించి ఉద్యోగులు ఎటువంటి కామెంట్ చేసినా వాళ్లను తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. సోమవారం తన టాక్ షోలో కిమ్మెల్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కిర్క్ హంతకుడు టేలర్ రాబిన్సన్తో తమకు సంబంధం లేనట్లు మేక్ అమెరికా గ్రేట్ అగేన్(మగా) ఉద్యమం చెప్పుకుంటున్నట్లు కిమ్మెల్ ఆరోపించారు. పొలిటికల్ పాయింట్లు స్కోరు చేసేందుకు మగా గ్యాంగ్ ప్రయత్నిస్తున్నట్లు కిమ్మెల్ తెలిపారు.