వాషింగ్టన్, డిసెంబర్ 30: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్(100) కన్నుమూశారు. జార్జియాలోని ప్లెయిన్స్లో ఉన్న తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1977 నుంచి 1981 మధ్య డెమోక్రటిక్ పార్టీ తరఫున కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేశారు. తన పదవీకాలంలో ప్రపంచ శాంతి కోసం ఆయన కృషి చేశారు. 1979లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారు.
చైనాతో దౌత్యపరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కులకు ప్రాధాన్యం కల్పించారు. 1980 ఎన్నికల్లో ఆయన ఓడిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రపంచ శాంతికి కృషి చేశారు. దీంతో 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. జిమ్మీ కార్టర్ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు.
జిమ్మీ కార్టర్‌కు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1977-78లో ఆయన భారత్‌లో పర్యటించి, పార్లమెంటులో ప్రసంగించారు. భారత్‌లో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షుడు కార్టర్. తన భార్య రోసలిన్ కార్టర్‌తో కలిసి హర్యానాలోని దౌలత్‌పూర్ నసీరాబాద్ అనే గ్రామాన్ని కార్టర్ సందర్శించారు. ఆ తర్వాత గ్రామస్థులు కార్టర్‌కు గౌరవసూచికగా తమ గ్రామానికి కార్టర్పురి అని పేరు పెట్టుకున్నారు. కార్టర్ తమ గ్రామానికి వచ్చిన జనవరి 3వ తేదీని సెలవుదినంగా ప్రకటించుకున్నారు.