బీజింగ్, మే 14: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మెదడు సంబంధిత వ్యాధి ‘సెరెబ్రల్ న్యూరిజమ్ (మెదడులోని రక్తనాళంలో బెలూన్స్ ఏర్పటడం)’తో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలెవరనీ కలవలేదని, 2020 షెన్జెన్లో జరిగిన బహిరంగ సభలో కూడా అనారోగ్యంగా కనిపించారనే ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో దేశంలో ఇటీవలి కొవిడ్ వ్యాప్తి విజృంభణను నివారించడంలో విఫలమైన నేపథ్యంలో జిన్‌పింగ్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉన్నదని చైనీస్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నది.
కరోనా కట్టడికి విధించిన కఠినమైన లాక్డౌన్ల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవడంతో ఆయన రాజీనామా చేయాలని అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా కోరినట్టు చైనా నెటిజన్లు పేర్కొంటున్నారు. జిన్‌పింగ్‌పై కెనడాకు చెందిన ఓ బ్లాగర్ చేసిన వీడియో ప్రస్తుతం చైనాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నుంచి జిన్‌పింగ్‌ను పక్కనపెట్టనున్నట్టు ఆ బ్లాగర్ తన వీడియోలో పేర్కొన్నారు. జిన్‌పింగ్ స్థానంలో ప్రస్తుత ప్రధాని లీ కెకియాంగ్ ఆ బాధ్యతలు చేపడుతారని, ప్రభుత్వంతో పాటు పార్టీ బాధ్యతలు చూసుకుంటారని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.