వాషింగ్టన్: ఇరాన్‌తో జరిగే చర్చల్లో పాల్గోనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పాకిస్థాన్ వెళ్లనున్నట్లు తెలిసింది. అమెరికా వర్గాలు దీనిపై సమాచారాన్ని అందజేశాయి. జేడీ వాన్స్‌తో పాటు అమెరికా దౌత్యవేత్తలుగా స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ కూడా వెళ్లనున్నారు. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు తొలుత ఇరాన్ ఆసక్తి ప్రదర్శించలేదు. అయితే ఇస్లామాబాద్‌కు తమ బృందాన్ని పంపేందుకు ఇరాన్ ఆసక్తి చూపడంతో.. జేడీ వాన్స్ టీమ్ కూడా పాక్ వెళ్లనున్నది.
ఇరాన్‌తో జరుగుతున్న చర్చలను ట్రంప్ తన వ్యాఖ్యలతో పదేపదే దెబ్బతీస్తున్నట్లు అమెరికా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాన్ స్టాప్ పబ్లిక్ కామెంట్రీ చేయడం వల్లే ఇరాన్‌తో చర్చల్లో ప్రగతి కనిపించడం లేదని ఆయన సలహాదారులు వెల్లడించారు. సోషల్ మీడియాతో పాటు వివిధ మీడియా సంస్థలకు ట్రంప్ ఇస్తున్న ఇంటర్వ్యూలు ఇరాన్ సమస్యను పొడిగిస్తున్నాయి తప్ప .. పరిష్కరించడం లేదని అమెరికా అధ్యక్షుడి సలహాదారులు అభిప్రాయపడుతున్నారు. యురేనియం అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు ట్రంప్ తన ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఆ పాయింట్‌ను వ్యతిరేకిస్తున్నది.
రిపోర్టర్లతో ఎక్కువగా మాట్లాడడం, ట్రుత్ సోషల్‌లో చీటికిమాటికి పోస్టులు పెట్టడం వల్ల .. ఇరాన్‌తో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్నట్లు అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. జేడీ వాన్స్ ఇప్పటికే పాక్ బయలుదేరినట్లు సోమవారం ట్రంప్ చెప్పారు. కానీ మళ్లీ ఇప్పుడు మంగళవారం ఆయన వెళ్తారని చెప్పడం .. అమెరికా అధికారుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నది. ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసే తేదీ అంశంలోనూ ట్రంప్ భిన్న వ్యాఖ్యలు చేయడం అందర్నీ అయోమయంలోకి నెట్టేసింది.