స్టాక్హూమ్: ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడానికి విశేషంగా కృషి చేస్తున్న జపాన్ సంస్థకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి లభించింది. హిరోషిమా, నాగసాకి నగరాలలో అమెరికా అణుబాంబు ప్రయోగంతో బాధితులైన వారి తరపున, అణ్వస్ర్తాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిహన్ హిడంక్యోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది. అణ్వాయుధానికి వ్యతిరేకంగా పోరాటం జరిపేందుకు తీవ్ర ఒత్తడి ఉన్నప్పటికీ, ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు దానిపై గళమెత్తడమే కాకుండా, బాధితులకు అండగా నిలిచినందుకు ఆ సంస్థకు ఈ అవార్డు ఇచ్చినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జార్గన్ వాట్నే ఫ్రైడ్నెస్ ప్రకటించారు. ‘చేదు జ్ఞాపకాలు, శారీరక సమస్యలతో బాధపడుతూ జీవించి ఉన్న అణ్వాయుధ భాధితులందరినీ గౌరవించాలని కోరుకుంటున్నామని, వారి విలువైన అనుభవాలను ఉపయోగించుకునేందుకు శాంతి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. హిబకుషా అనే మరో పేరు కూడా ఉన్న నిహన్ హిడంక్యో అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన వారికి సేవలు అందిస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు, బాధలు మరే సమాజం అనుభవించరాదని పేర్కొంటూ.. అణ్వాయుధాలను మళ్లీ వాడరాదంటూ బాధితులు, మద్దతుదారులతో పలుసార్లు ప్రదర్శనలు చేయించింది.
పసిఫిక్‌లోని అణు దాడి బాధితులు, స్థానిక హిబాకుషా సంస్థలు 1956లో జపాన్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఏ అండ్ హెచ్ బాంబ్ సఫర్స్ సంస్థను స్థాపించారు. తర్వాత దీనిని జపనీయులు క్లుప్తంగా నిహన్ హిడంక్యోగా పిలిచేవారు. అనంతర పరిణామాల్లో ఇది జపాన్‌లోనే అతి పెద్ద, ప్రభావవంతమైన హిబకుషా సంస్థగా ఎదిగింది. అణ్వాయుధాల విపత్కర పరిణామాల గురించి ప్రచారం చేయడమే ప్రధాన ధ్యేయంగా సంస్థ పనిచేసేది. అణు దాడి బాధితులు తమ అనుభవాలు, బాధలు, కష్టాల గురించి విద్యాపరమైన ప్రచారం చేయడంతో పాటు వివిధ మార్గాల్లో వాటిని పంచుకునేవారు. అణ్వాయుధాల ప్రభావంతో మనమే కాక, మన తర్వాతి తరాలు ఎదుర్కొనే దుష్పరిణామాలను కళ్లకు కట్టేవారు. అణ్వాయుధాలు అధికార దాహాన్ని తీరుస్తాయే తప్ప అణువంత కూడా మానవాళికి మేలు చేయవని వారు తమ ప్రచారం ద్వారా గట్టిగా వివరించే వారు. ఈ క్రమంలో ఈ సంస్థ వేలకొద్దీ సాక్షుల ఖాతాలను జన బాహుళ్యానికి అందించింది. తీర్మానాలు, ప్రజా విజ్ఞప్తులను జారీ చేసింది.