భూమి ఎక్కడిది? ఈ సూర్యుడు ఎక్కడివాడు? సౌర మండలం ఎలా వచ్చింది? కోట్ల పాలపుంతలు, అంతకుమించిన నక్షత్రాలు, కృష్ణబిలాలు, అనంత శూన్యం.. అసలీ విశ్వం ఎలా పుట్టింది? అన్న ప్రశ్నలు శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. విశ్వం గుట్టును తెలుసుకోవాలన్న సంకల్పంతో శాస్త్రవేత్తలు బృహత్తర ప్రాజెక్టుకు కార్యరూపం ఇచ్చారు. అదే.. సూపర్-కామియోకాండే (సూపర్-కే). జపాన్‌లోని హిడా నగరానికి దగ్గరలో ఐకెనో పర్వతం కింద 1 కిలోమీటర్ లోతులో సూపర్-కే ట్యాంక్‌ను నిర్మించారు. దీని ద్వారా న్యూట్రినోల గుణాన్ని తెలుసుకోనున్నారు.
ఏమిటీ న్యూట్రినోలు..
పరమాణువులోని ఎలాంటి విద్యుదావేశం లేని కణమే న్యూట్రినో. ఇది ఇతర పరమాణువులతో అతి తక్కువగా ప్రతిస్పందిస్తుంది. విద్యుదావేశం లేకపోవటం వల్ల ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కిరణాలకు చలించదు. రేడియో ధార్మికత, పరమాణు ప్రతి చర్య వల్ల ఏర్పడుతాయి. అందుకే ఇవి సూర్యుడి ఉపరితలం, అణు పరిశోధనలు జరిగేచోట, కాస్మిక్ కిరణాలు అణువులను తాకినపుడు ఉద్భవిస్తాయి. వీటి కోసం వెతకటం కష్టంతో కూడుకొన్న పని. ఎందుకంటే ఇవి ఎలాంటి పదార్థం నుండైనా ప్రయాణించగలవు. అదీ ఎలాంటి హాని చేయకుండా. ఈ న్యూట్రినో గుణాన్ని తెలుసుకొంటే విశ్వం గుట్టును తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రయోగం ఇలా..
న్యూట్రినోలు చాలా వేగంగా, దేన్నుంచైనా ప్రయాణిస్తాయి. ఆ ప్రయాణ సమయంలో తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ తరంగాలను ట్యాంకులో ఉండే వేల లైట్ సెన్సిటివ్ ఫొటో మల్టిప్లయర్ ట్యూబ్‌లు బంధిస్తాయి. అయితే, న్యూట్రినోల గుణాన్ని తెలుసుకోవాలంటే కచ్చితంగా నీరు అత్యంత స్వచ్ఛతను కలిగి ఉండాలి. దానికోసం నీటిని పలు దశల్లో శుద్ధి చేస్తారు. బ్యాక్టీరియా లాంటివి ఉంటే యూవీ కిరణాలను ప్రసరింపజేసి, ఆల్కలైన్ నీటిగా మార్చేస్తారు.
హైపర్-కే
సూపర్ కే కంటే 20 రెట్లు పెద్దదైన హైపర్ కే నిర్మాణానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. 2026 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. సూపర్ కేలో 11 వేల లైట్ డిటెక్టర్స్ ఉండగా, హైపర్ కేలో 99వేల లైట్ డిటెక్టర్స్‌ను ఏర్పాటుచేయనున్నారు.
ఎందుకు అంత లోతులో నిర్మించారు?
కాస్మిక్ కిరణాలు, ఇతర అణువుల ప్రభావం పడకుండా, కేవలం న్యూట్రినోల గుణాన్ని తెలుసుకొనేందుకు సూపర్-కేను 1000 మీటర్ల లోతులో, రూ.5 వేల కోట్లతో 1983లో నిర్మించారు.
సూపర్-కే స్వరూపం