న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్టులుగా జపాన్, సింగపూర్ దేశాలకు చెందిన పాస్‌పోర్టులు నిలిచాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాకింగ్స్లో భారత్ 83వ స్థానంలో నిలిచింది. భారత్ గత ఏడాది అక్టోబర్ నుంచి ర్యాకింగ్స్లో ఏడు స్థానాలు పైకి ఎగబాకింది. దీంతో భారత్ పాస్‌పోర్ట్ సహాయంతో ముందస్తు వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లేందుకు వీలు కలిగింది.
ఇండెక్స్‌లో జపాన్, సింగపూర్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలువగా.. వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించే వీలుంది. జాబితాలో జర్మనీ, దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలిచి, 190 దేశాలకు ప్రయాణించొచ్చు. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. ఆయా దేశాల పాస్‌పోర్టులు ఉన్న పౌరులు ముందస్తు వీసా లేకుండా 189 దేశాలకు ప్రయాణించొచ్చు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఒక స్థానం మెరుగుపరుచుకొని ఆస్ట్రియా, డెన్మార్క్‌తో కలిసి నాలుగో స్థానంలో నిలిచాయి.
ఐర్లాండ్, పోర్చుగల్ ఐదో స్థానంలో, బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ ఆరు స్థానంలో ఉన్నాయి. ఆయా దేశాల పౌరులు వీసా లేకుండా 186 దేశాలకు వెళ్లొచ్చు. ఆస్ట్రేలియా, కెనడా సహా చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా తమ స్థానాలను మెరుగుపరుచుకొని ఏడో స్థానంలో నిలిచాయి. హంగేరి, పోలాండ్ 8వ స్థానంలో, లిథువేనియా, స్లోవేకియా పాస్‌పోర్ట్‌లు 9వ స్థానం, ఎస్టోనియా, లాట్వియా పాస్‌పోర్టులు పదో స్థానంలో నిలువగా.. ఆయా దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు 181 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించొచ్చు.