టోక్యో: జపాన్ భూభాగం ఎంత అన్నది ఆ దేశానికే తెలియనట్లుంది. తమకు చెందిన ఏడు వేల దీవులను (Japan New Islands) కొత్తగా కనుగొన్నట్లు తాజాగా వెల్లడించింది. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అథారిటీ ఆఫ్ జపాన్ (జీఎస్ఐ) ద్వారా డిజిటల్ మ్యాపింగ్‌లో చూపించిన దాని కంటే 7,000 ఎక్కువ దీవులు కలిగి ఉన్నట్లు తెలిపింది. జపాన్ భూభాగంలోని మొత్తం దీవుల సంఖ్య 14,125గా వెల్లడించింది. 1987లో జపాన్ కోస్ట్ గార్డ్ రూపొందించిన నివేదిక ఆధారంగా అధికారికంగా వాడుకలో ఉన్న 6,852 దీవుల సంఖ్య కంటే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ అని సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, తాజాగా కనుగొన్న కొత్త దీవులు తమ భూభాగంలో మార్పు వల్ల కాదని జపాన్ తెలిపింది. సాంకేతికతలో పురోగతి, మ్యాప్‌లను వివరణాత్మకంగా పరిశీలించే తమ దేశ సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తున్నదని వెల్లడించింది. అలాగే ద్వీపాలను ఎలా లెక్కించాలన్న దానిపై అంతర్జాతీయ ఒప్పందం ఏమీ లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల కిందట జరిగిన సర్వేలో ఆ పరిమాణ ప్రమాణాన్ని జీఎస్ఐ ఏజెన్సీ వినియోగించిందని తెలిపింది. అయితే కనీసం 100 మీటర్ల (330 అడుగులు) చుట్టుకొలత ఉన్న అన్ని సహజ ద్వీపాల భూభాగాలను కూడా తాజాగా లెక్కించినట్లు పేర్కొంది. కృత్రిమంగా పొందిన భూమి ఏదీ కూడా ఈ కొత్త సంఖ్యలో లేదని జపాన్ వెల్లడించింది.
మరోవైపు జపాన్ చుట్టూ ఉన్న అనేక దీవులపై పలు వివాదాలున్నాయి. రష్యా ఆధీనంలో ఉన్న దక్షిణ కురిల్ దీవులు తమవిగా జపాన్ చెబుతోంది. ఈ ప్రాంతాన్ని నార్తర్న్ టెరిటరీస్ అని జపాన్ వ్యవహరిస్తోంది. అలాగే తూర్పు చైనా సముద్రంలో జనావాసాలు లేని సెంకాకు దీవులపై తమకు హక్కు ఉందని జపాన్ వాదిస్తోంది. అయితే ఆ వాదనను చైనా పలుమార్లు ఖండించింది. కాగా, జపాన్ సముద్రంలోని డోక్డో దీవులు తమవిగా దక్షిణ కొరియా, తకేషిమా ద్వీపాల సమూహంపై సార్వభౌమాధికారం తమదే అని జపాన్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ కొత్తగా పేర్కొన్న ఏడు వేల అదనపు దీవుల్లో ఈ వివాదస్పద దీవులు కూడా ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.