టోక్యో: జపాన్ సోషలిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని తొమిచి మురయమ(Tomiichi Murayama) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. ఓయిటా సిటీలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1924 మార్చి 3వ తేదీన ఆయన ఓయిటా జిల్లాలో జన్మించారు. 1938లో ఆయన టోక్యోకు వలస వెళ్లారు. ఆ తర్వాత సైనిక దళాల్లో చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో కుమమోటో వద్ద విధులు నిర్వర్తించారు. 1972లో ఆయన తొలిసారి దిగువ సభకు ఎన్నికయ్యారు. జపాన్ సోషలిస్టు పార్టీకి ఆయన 1993లో చైర్మన్ అయ్యారు. 1994, జూన్ 29వ తేదీన జపాన్ 81వ ప్రధానిగా మురియమ బాధ్యతలు స్వీకరించారు.
రెండో ప్రపంచ యుద్ధానికి 50 ఏళ్లు ముగిసిన సందర్భంగా 1995లో జరిగిన కార్యక్రమంలో యురయమ ఓ ప్రకటన చేశారు. తప్పుడు జాతీయ విధానం వల్ల జపాన్ యుద్ధ కాంక్షను ప్రదర్శించినట్లు చెప్పారు. దీంతో జపాన్ ప్రజలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లినట్లు చెప్పారు. తమ వల్ల అనేక దేశాల ప్రజలు, ముఖ్యంగా ఆసియా దేశాల్లో డ్యామేజ్ ఎక్కువగా జరిగిందన్నారు. 2000 సంవత్సరంలో ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.