కుక్కపిల్లలను పెంచుకునే వారందరికీ సాయంత్రం పూట వాక్ తప్పనిసరి. పెంపుడు కుక్కలను సాయంత్రం పూట బయటకు తీసుకెళ్లకపోతే అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కానీ బయట భయంకరంగా ఎండలు మండిపోతుంటే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు అలాగే మండిపోతున్నాయి.
మనుషులే ఈ ఎండ తట్టుకోలేకపోతుంటే.. ఇక పెంపుడు జంతువుల పరిస్థితి మాటల్లో చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో జంతువులకు చల్లని గాలి అందించేందుకు జపాన్‌కు చెందిన ‘స్వీట్ మమ్మీ’ అనే కంపెనీ కొత్త ప్లాన్ వేసింది. జంతువుల కోసం ప్రత్యేకంగా ఒక డ్రెస్‌ను రెడీ చేసింది. ఇంత వేడిలో జంతువులకు డ్రెస్ ఏంటి? అనుకోకండి. ఎందుకంటే ఇది నెట్ డ్రెస్.
గాలి ధారాళంగా ఆడుతుంది. అంతేకాదు, ఈ డ్రెస్ పైన ఒక చిన్న ఫ్యాన్ కూడా అమర్చారు. దీంతో జంతువులకు చల్లని గాలి అందుతుంది. ఈ మాటెర్నిటీ క్లోతింగ్ కంపెనీ ప్రెసిడెంట్ రీ ఉజావా.. తనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో వెల్లడించారు. ‘‘నేను పెంచుకునే కుక్కపిల్లను సాయంత్రం వాక్కు తీసుకెళ్లినప్పుడు ఎండలకు అది చాలా ఇబ్బంది పడటం చూశా.
అప్పుడే ఈ ఆలోచన వచ్చింది’’ అని చెప్పారు. నెట్ వంటి కోట్కు ఒక చిన్న ఫ్యాన్ బిగించిన ఉన్న ఈ డ్రెస్‌ను కుక్కలతోపాటు పిల్లులకు కూడా వేయొచ్చని ఉజావా తెలిపారు. బ్యాటరీ సాయంతో ఈ ఫ్యాన్ పనిచేస్తుందని, రోజూ ఒక పదినిమిషాలు వాడితే మూడు నెలలపాటు పనిచేస్తాయని వివరించారు. ఇంకెందుకు ఆలస్యం..? మీరు కూడా వీటిపై ఒక లుక్కేయండి.