బ్రెజిల్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకి (Jair Bolsonaro) జైలు శిక్ష పడింది. సైనిక కుట్ర కేసులో బోల్సొనారోకి 27 ఏండ్ల 3 నెలల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2022 ఎన్నికలలో తన ప్రత్యర్థి, వామపక్ష నాయుకుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా (Luiz Inacio Lula da Silva) చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బోల్సొనారో కుట్ర పన్నినట్లు తేలడంతో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్యానల్ శిక్ష ఖరారు చేసింది. దీంతో ప్రజాస్వామ్యాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన కేసులో జైలు శిక్ష పడిన మొదటి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు.
2022 నాటి ఎన్నికల్లో ఓటమి తర్వాత బోల్సొనారో మద్దతుదారులు రాజధాని బ్రసీలియాలో విధ్వంసం సృష్టించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు. బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలని, డ సిల్వాను దింపేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను రెచ్చగొడుతూ ‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’ అంటూ బోల్సొనారో పిలుపునిచ్చారు. దేశ సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కారణంగా లూలా డిసిల్వా గెలుపొందారని, ప్రజల ఓట్ల కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బోల్సొనారో కొట్లాటలను ప్రేరేపించినట్లుగా ఉందని దేశ ప్రాసిక్యూటర్ జనరల్ అభ్యర్థనమేరకు సుప్రీంకోర్టు ఆయనతోపాటు మరో 33 మందిపై విచారణకు అనుమతించింది. కాగా, తన మిత్రుడు బోల్సోనారోకు శిక్ష విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు.