ప్రపంచంలో అత్యంత చిరాకు కలిగేంచేవాటిపై ఓ జాబితా తయారుచేస్తే అందులో ట్రాఫిక్కు చోటుంటుంది. ట్రాఫిక్ చిక్కులు అవి అనుభవించే వారికే బాగా తెలుసు. చైనాకు చెందిన ఓ పారిశ్రామికవేత్తకు కూడా ట్రాఫిక్ తిప్పలు బాగా అనుభవం ఉన్నట్లుంది. అందుకే, ట్రాఫిక్ లేనప్పుడు డ్రైవ్ చేస్తూ, ట్రాఫిక్ ఉన్నప్పుడు హెలికాప్టర్లా ఎగురుతూ వెళ్లే కారును రూపొందించారు. ఇది ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం. చైనాకు చెందిన ఏరోహ్ట్ అనే స్టార్టప్ కంపెనీ దీన్ని తయారుచేసింది.
హైస్కూలు చదువును మధ్యలో ఆపేసిన హౌ డేలి అనే వ్యక్తి ఈ కంపెనీ యాజమాని కావడం మరో విశేషం. ఇటీవలే చైనా, దుబాయ్లో ఈ కారును ప్రదర్శించారు. ఇందులో కారులో ఉండే అన్ని హంగులూ, సౌకర్యాలూ ఉంటాయి. ఈ కారుకు నాలుగు ఎలక్ట్రిక్ ఇంజన్లు, ఎనిమిది ప్రొపెల్లర్లు(ఫ్యాన్లు) ఏర్పాటుచేశారు. 2025 నుంచి ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నది. దీని ధర దాదాపుగా రూ.1.16 కోట్లు ఉండే అవకాశం ఉంది.