టెల్ అవీవ్: అక్టోబర్ 7న హమాస్ అనూహ్య దాడి నేపథ్యంలో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. (Israel-Hamas War) రష్యాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సిరియాపై కూడా దాడులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, రష్యా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. దశాబ్దాలుగా ప్రపంచ యుద్ధ భూమిగా సిరియా మారింది. ఇజ్రాయెల్ ఆక్రమించిన సిరియాలోని గోలన్ హైట్స్ వద్ద ఇస్లామిక్ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సుమారు వెయ్యి మంది సైనికులను అమెరికా మోహరించింది. సిరియా ఉత్తరాన పట్టున్న కుర్దిష్ గ్రూపులతో టర్కీ పోరాడుతున్నది.
కాగా, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ అధికారంలో ఉండటానికి ఇరాన్, రష్యా సహకరిస్తున్నాయి. దీంతో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్ ఫైటర్స్‌తోపాటు రష్యా ఏర్పాటు చేసిన ఎయిర్‌బేస్ వద్ద ఆ దేశ సైనికులు సిరియాలో ఉన్నారు. దీంతో సిరియాలోని ఉగ్రవాద సంస్థలపై దాడులకు ముందు ఆ విషయాన్ని ముందుగా రష్యాకు ఇజ్రాయెల్ చెప్పేది.
అయితే ఇటీవల రష్యాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సిరియాలోని డమాస్కస్, అలెప్పోలో విమానాశ్రయాలపై కూడా బాంబులు వేసింది. దీంతో ఆ రెండు ఎయిర్‌పోర్టుల్లో పౌర విమాన సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హ్మీమిమ్లోని తమ ఎయిర్‌బేస్‌లో పౌర విమానాలు దిగేందుకు రష్యా అనుమతించింది.
మరోవైపు, సాధారణ నియమం ప్రకారం సిరియాలో దాడులకు ముందు ఇజ్రాయెల్ రష్యాకు తెలియజేయడం లేదని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి మిఖాయిల్ బొగ్డనోవ్ శుక్రవారం ఆరోపించారు. దాడుల తర్వాతే ఈ విషయం తమకు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, రష్యా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని యుద్ధ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు.