Israel bomb : ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించే లక్ష్యంతో ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజా (Gaza) పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) కు చెందిన ఫైటర్ జెట్ జారవిడిచిన ఓ బాంబు పొరపాటున సొంత ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో పడింది.
గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ ప్రజలు నివసించే నిర్ యిట్జాక్ ప్రాంతంలో ఐడీఎఫ్ యుద్ధ విమానం బాంబును జారవిడించింది. గాజా మిషన్ కోసం వెళ్తున్న విమానం నుంచి బాంబు జారిపడిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పిదం జరిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. యిట్జాక్ ప్రాంతంలో 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే బాంబువల్ల వారిలో ఎవరికీ ఏమీ కాలేదని తెలిసింది.
కాగా ఇటీవల గాజా పర్యటన సందర్భంగా నెతన్యాహు తన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉందన్నారు. బందీలను అందరినీ విడుదల చేయాలని తాము హమాస్‌పై ఒత్తిడి చేస్తున్నామని, మా యుద్ధ లక్ష్యాలన్నింటిని సాధించుకోవాలని పోరాడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.