Air Strikes | యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ ఆదివారం భారీగా వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. కొన్ని రోజుల క్రితం హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు క్లస్టర్ బాంబులను ప్రయోగించిన ప్రయోగించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా రెడ్ సీలో, అడెన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి హౌతీ దాడులు ఇజ్రాయెల్‌కు నౌకల భద్రతకు తీవ్ర ముప్పుగా మారింది. యెమెన్ రాజధాని సనాలోని కీలక ప్రాంతాల్లో, అలాగే హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా యెమెన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పేలుడు శబ్దాలు, పొగ దట్టంగా వ్యాపించింది. అయితే, హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటివరకు దాడులతో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంటోందని హౌతీ అధికార ప్రతినిధులు మండిపడ్డారు. ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ సైన్యం నుంచి సైతం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. తమ ప్రయోజనాలు, నౌకల భద్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో కఠిన చర్యలుంటాయని ఇజ్రాయెల్ గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.
హౌతీ తిరుగుబాటుదారులు చాలా కాలంగా ఇజ్రాయెల్ వైపు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తున్నారు. ఎర్ర సముద్రంలో ఓడలపై దాడి చేశారు. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి పాలస్తీనియన్లకు మద్దతుగా తాము ఈ చర్యలకు దిగినట్లుగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ చాలా మిస్సైల్స్‌ను, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేయగా.. తాజాగా క్లస్టర్ బాంబులతో హౌతీలు విరుచుకుపడుతున్నారు. హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న అల్-మసిరా టీవీ ఛానల్ ఆదివారం జరిగిన వైమానిక దాడి ఆగస్టు 17 తర్వాత జరిగిన మొదటి దాడి అని పేర్కొంది. దీనికి ముందు ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలతో అనుసంధానించబడిన, తిరుగుబాటుదారులు ఉపయోగిస్తున్న స్థావరాలపై దాడి చేసింది. అయితే, ఆదివారం జరిగిన దాడిని ఇజ్రాయెల్ అధికారికంగా ధ్రువీకరించలేదు. గాజా యుద్ధం ప్రభావం ఇజ్రాయెల్-పాలస్తీనాకే పరిమితం కాలేదు. యెమెన్ సహా పలు ప్రాంతాలకు విస్తరించింది.