Israel- Hamas War | గాజా సిటీ: గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ అందులో హెచ్చరించింది. ఐరాస సమన్వయకర్త టోర్ వెన్నెస్‌ల్యాండ్‌ను ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ లెబనాన్ రాజధాని బీరుట్లో కలిసారు. యుద్ధ పరిస్థితిపై చర్చించారు.
ఇజ్రాయెల్‌లోకి హమాస్ మిలిటెంట్ల చొరబాటు సూత్రధారి, కిబ్బుట్జ్ నిరిమ్లో ఊచకోతకు బాధ్యుడైన బిల్లాల్ అల్ కేద్రాను ఖాన్ యూనిస్ పట్టణంపై జరిపిన దాడుల్లో చంపేశామని ఇజ్రాయెల్ వైమానిక దళం ఓ ప్రకటించింది.
ఈనెల 7న హమాస్ జరిపిన దాడుల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు ఇజ్రాయెలీ మహిళా సెక్యూరిటీ అధికారులు మరణించారని అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. యుద్ధంలో రెండు వైపులా మరణాల సంఖ్య 5,200కు పైగా చేరింది. 2,329 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్టు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో 1300కి పైగా మరణించగా, ఇజ్రాయెల్ దాడుల్లో 1500 మంది హమాస్ మిలిటెంట్లు హతమయ్యారు.
గాజా సరిహద్దు వైపునకు 30 వేల మంది బలగాలను తరలించిన ఇజ్రాయెల్ సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకు రాజకీయ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. గ్రౌండ్ ఆపరేషన్‌తో హమాస్ గ్రూపు టాప్ రాజకీయ, సైనిక నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకొన్నదని న్యూయార్స్ టైమ్స్ కథనం పేర్కొన్నది.
23 లక్షల మంది ప్రజలు నివాసం ఉండే గాజా స్ట్రిప్ వణికిపోతున్నది. ఆహారం, నీరు, ఇంధనం లేక స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు మంచి నీరు, బ్రెడ్ దొరకడం లేదని గాజా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితులతో స్థానిక దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. అత్యవసర ఔషధాలు, ఇతర వైద్య సామగ్రి కొరతతో వైద్యులు వారికి చికిత్స అందించలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.