Israel : ఒకపక్క ఇరాన్-అమెరికా మధ్య చర్చల అంశం నడుస్తోంది. ప్రపంచం అంతా ఈ చర్చల్ని గమనిస్తోంది. కానీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై దాడులు చేస్తూ తన పని కానిచ్చేస్తోంది. అది కూడా మామూలుగా కాదు.. ఏకంగా లెబనాన్‌లోని కొన్ని గ్రామాల్నే ఇజ్రాయెల్ తుడిచిపెట్టేస్తోంది. ఇరాన్‌తో యుద్ధం ఆరంభం తర్వాత ఇజ్రాయెల్.. లెబనాన్‌పై కూడా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా వంటి తీవ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
కొన్ని ప్రాంతాల్నే పూర్తిగా మాయం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పంథా అనుసరిస్తోంది. లెబనాన్‌లోని ఇండ్ల మధ్యలో తవ్వి, పేలుడు పదార్థాలు పెడుతోంది. తర్వాత వాటిని రిమోట్‌తో పేల్చేస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాలైన తయ్బే, నకోరా, డైర్ సిరియన్ వంటి ప్రాంతాల్లోని అనేక గ్రామాలు కనుమరుగయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి పేలుళ్లు, విధ్వంసం జరిగిందని లెబనాన్ మీడియా కూడా వెల్లడించింది. సాధారణంగా జరిగే ఏదో ఒక ప్రత్యేక ప్రదేశాన్ని లక్ష్యం చేసుకోకుండా, మొత్తం ఇండ్లనే ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తోంది. లెబనాన్ సరిహద్దు గ్రామాల్లోని ఇండ్లను మొత్తం ధ్వంసం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. గతంలో గాజాలోలాగే ఇక్కడ కూడా దాడి చేసి, నివాసాల్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. రాఫా ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ ఇలాగే చేసింది.
అక్కడి 90 శాతం ఇండ్లను ధ్వంసం చేసింది. అయితే, ఈ విషయంలో ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చట్టపరమైన సమస్యల్ని ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి వస్తుందని పలు అంతర్జాతీయ హక్కుల సంఘాలు విమర్శించాయి. అయితే, పౌర నివాసాల్ని కేంద్రంగా చేసుకుని హెజ్బొల్లా అనే తీవ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, వాటిని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ తన దాడుల ద్వారా సరిహద్దు ప్రాంతంలో పూర్తి పట్టు సాధించాలని భావిస్తోంది.