టెహ్రాన్: ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉన్న ఫోర్డో భూగర్భ అణు కేంద్రం(Fordo Nuclear Site)పై ఇవాళ మరోసారి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన మీడియా దీని గురించి వార్తలు ప్రసారం చేసింది. ఫోర్డోపై మళ్లీ దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొన్నది. అయితే యురేనియం శుద్దికి చెందిన ఫోర్డో అణు కేంద్రం లో భారీ నష్టం జరిగి ఉంటుందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. భూగర్భ అణు కేంద్రంపై రెండు రోజుల క్రితం అమెరికా బీ2 బాంబర్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. బంకర్ బస్టర్ బాంబర్లతో ఆ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనపై వియన్నా నుంచి ఐఏఈఐ అధినేత రఫేల్ మారియానో గ్రోసీ ప్రకటన చేశారు. ఫోర్డోను పేల్చేందుకు భారీగా పేలోడ్ బాంబులను వినియోగించారని, చాలా తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయని, బహుశా తీవ్ర స్థాయిలో డ్యామేజ్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నామని మారియానో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫోర్డో భూగర్భ కేంద్రంలో ఎంత నష్టం జరిగిందన్న దానిపై సమగ్రంగా అంచనా వేయలేమని ఆయన తెలిపారు.
సుమారు 30 వేల పౌండ్ల బరువు ఉన్న జీబీయూ-57 ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబును అమెరికా వినియోగించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని బంకర్ బస్టర్ బాంబుగా పిలుస్తారు. ఫోర్డో కేంద్రాన్ని ఇదే ధ్వంసం చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. భూగర్భంలోకి సుమారు 200 ఫీట్ల లోతుకు వెళ్లిన తర్వాత బాంబు పేలుతుంది. ఫోర్డో కేంద్రంపై జరిగిన దాడి సమయంలో సుమారు ఆరు బంకర్ బస్టర్ బాంబులు వాడి ఉంటారని అమెరికా మీడియా తెలిపింది. నటాంజ్, ఇస్పాహన్ అణు కేంద్రాలపై.. 400 మైళ్ల దూరంలో ఉన్న సబ్మెరైన్ల నుంచి దాడి చేశారు. దాదాపు 30 తోమాహక్ మిస్సైళ్లతో ఆ రెండు కేంద్రాలపై అటాక్ చేశారు.