Iran Warns UK : పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) దేశాలు మిస్సైల్లు, డ్రోన్లతో ఇరాన్ (Iran) పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ తనచుట్టూ ఉన్న దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన, ఇజ్రాయెల్‌పైన భీకర దాడులు చేస్తున్నది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్ (Britain) కు తీవ్రమైన హెచ్చరికలు చేసింది. తమపై దాడుల కోసం అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అవకాశం ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో బ్రిటన్ జోక్యం శ్రుతి మించితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి (Iran Foreign Minister) సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ (Sayyed Abbas Aragchi) హెచ్చరించారు. ఈ మేరకు అరాఘ్చీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
‘ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న ఈ యుద్ధంలో భాగం కావాలని బ్రిటన్ ప్రజల్లో అధిక శాతం మంది కోరుకోవడం లేదు. కానీ వారి ప్రధాని స్టార్మర్ మాత్రం సొంత ప్రజల అభిప్రాయాన్ని విస్మరించి, ఇరాన్‌పై దాడికి యూకే స్థావరాలను వినియోగించుకునే అవకాశం ఇస్తున్నారు. తద్వారా ఆయన బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవడానికి ఇరాన్ వెనుకాడదు’ అని అరాఘ్చీ తన పోస్టులో వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం తమది కాకపోయినా బ్రిటన్ అనవసరంగా తలదూరుస్తోందని పరోక్షంగా మండిపడ్డారు.
ఈ అంశంపై ఇరాన్ అధికారికంగా కూడా తన ఆందోళనను బ్రిటన్‌కు తెలియజేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ.. బ్రిటన్ హోంమంత్రి యెవెట్ కూపర్‌తో ఫోన్లో మాట్లాడారు. అమెరికాకు సైనిక స్థావరాలను అందుబాటులో ఉంచడాన్ని తమపై జరుగుతున్న దురాక్రమణలో పాలుపంచుకోవడంగానే పరిగణిస్తామని ఆయన స్పష్టంచేశారు. అయితే ఇరాన్ హెచ్చరికలకు బ్రిటన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. అరాఘ్చీతో జరిగిన ఫోన్ సంభాషణలోనే హోంమంత్రి యెవెట్ కూపర్ తమ వైఖరిని స్పష్టంచేశారు.
బ్రిటన్ స్థావరాలు, భూభాగం, లేదా ఇతర ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవద్దని కూపర్ హితవు చెప్పారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాగా ఈ పరస్పర హెచ్చరికలతో ఇరాన్, బ్రిటన్ మధ్య దౌత్యపరమైన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.