Iran Conflict : అగ్రరాజ్యం అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య గత రాత్రి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల ఈ తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ (Israel) కూడా స్వాగతించింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇరాన్ ఉల్లంఘించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలైన దుబాయ్, సౌదీ, కువైట్‌పై ఇరాన్ మిస్సైల్ దాడులతో విరుచుకుపడిందనే ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ తమపై మిస్సైల్ దాడులకు పాల్పడిందని ఆరోపించింది.
ఇరాన్ గంటల వ్యవధిలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమ నగరాలపైకి క్షిపణులు ప్రయోగించిందని, వాటిని మధ్యలోనే తమ బలగాలు అడ్డుకుని కూల్చేశాయని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఇజ్రాయెల్ సైన్యం హైఅలర్ట్ ప్రకటించింది. గంట వ్యవధిలోనే ఇరాన్ మూడుసార్లు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ఈ దాడులను ఎదుర్కొనేందుకు తమ రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపింది.
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలన్న షరతుతో ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడులను ట్రంప్ రెండు వారాలపాటు వాయిదా వేశారు. ఈ ఒప్పంద ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ దాడులకు దిగిందనే వార్తలు పరిస్థితిని ఆందోళనకరంగా మార్చాయి. శాంతి దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇరాన్ దాడులకు పాల్పడిందన్న వార్తలు పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధ భయాలను సృష్టించాయి. ఇరాన్ వైఖరిపై అమెరికా, ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.