Benjamin Netanyahu : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇరాన్ ఘాటు హెచ్చరిక జారీ చేసింది. తాము నెతన్యాహును నరకానికి పంపుతాం అని హెచ్చరించింది. ఇదే సమయంలో ఇకపై తమ యుద్ధం కొత్త విధానంలో ఉంటుందని ఇరాన్ తెలిపింది.
తమ నౌకా మార్గాన్ని బ్లాక్ చేసిన అమెరికాకు కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ మేజర్ జనరల్ మోషెన్ రెజాయే తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్, అమెరికాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు బ్యారోన్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు అంటూ నేరుగా ట్రంప్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాము అలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఇదంతా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన తప్పుడు సమాచారం అన్నారు.
అయితే, తాము నెతన్యాహును నరకానికి పంపుతాం అని హెచ్చరించారు. నెతన్యాహు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు జియోనిస్ట్ పాలనకు ముగింపు పలకబోతుందనే విషయాన్ని తాము నిరూపిస్తామని వివరించారు. ట్రంప్ కుమారుడిని చంపాలనుకుంటున్నట్లు నెతన్యాహు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ట్రంప్‌ను ఆందోళనకు గురయ్యేలా చేశారని, దీంతో ట్రంప్ ఒక ఫుడ్ ట్రక్ వర్కర్‌లాగా మారాల్సి వచ్చిందిన మోషెన్ వ్యాఖ్యానించారు.