Iran vs US : ఇరాన్- అమెరికా (Iran-US) దేశాల మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణలను తీవ్రం చేస్తూ.. ఐఆర్జీసీ (IRGC) దళాలు అగ్రరాజ్యానికి చెందిన విమాన వాహక నౌక, డెస్ట్రాయర్‌పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ నౌకలు హర్మూజ్ (Strait of Hormuz) లో ఇరాన్ ట్యాంకర్లను అడ్డుకుంటుండడంతో.. వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది.
ఈ దాడుల్లో అమెరికా యుద్ధ నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆ తర్వాత అవి హర్మూజ్‌ను విడిచి వెళ్లిపోయాయని తెలిపింది. శనివారం హర్మూజ్‌లోని ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడుల అనంతరం ఐఆర్జీసీ ఈ దాడులకు పాల్పడింది. హర్మూజ్‌లో అనధికారిక మార్గాల్లో ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లను, అమెరికాకు అనుబంధంగా ఉన్న మరో మూడు నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది.
ఇరాన్ నౌకల విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తూ దాడులు కొనసాగిస్తే తమ నుంచి గట్టి ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆ దేశ సైనిక నౌకలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. గతంలో కంటే తాము ఇప్పుడు మరింత బలంగా ఉన్నామని పేర్కొన్నది. కాగా మరోవైపు ఇరాన్ దాడుల నుంచి తమ నౌకలు సురక్షితంగా తప్పించుకున్నాయని అమెరికా ప్రకటించింది.
ఇరాన్ దాడుల్లో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నది. తమ నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ నౌకలపై దాడులు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది.