రెండు గదులున్న రేకుల షెడ్డులో పుట్టింది. మూడు చక్రాల ఆటో డ్రైవర్ బిడ్డగా పెరిగింది. తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఆశతో చదివింది. గ్లోబల్, ఇంటర్నేషనల్ వంటి గొప్ప గొప్పస్కూళ్లలో చదవకపోయినా ఏ ఎంట్రన్స్ రాసినా టాప్ కాలేజీలో సీటు గ్యారెంటీ ర్యాంక్ తెచ్చుకునేది. పీజీ ఎంట్రన్స్ కోచింగ్ లేకుండానే ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో సీటు సాధించింది. ట్యూషన్లు చెబుతూ పేదతండ్రికి చేదోడుగా ఉంటూ ఎమ్మెస్సీలో అయిదు గోల్డ్ మెడల్స్ సాధించింది బేగంపేట నిఖిత. పేదరికానికి భయపడకుండా, బాధపడకుండా, అవమానం అనుకోకుండా కష్టపడితే విజయం సాధ్యమేనని చెప్పిన ఆటోడ్రైవర్ బిడ్డ చెప్పిన ఆత్మగౌరవ ముచ్చట ఇది!
నేను పుట్టింది, పెరిగింది గండిగూడ గ్రామం (సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం)లోనే. మా ఊరు హైదరాబాద్ సిటీకి దగ్గర్లో ఉంటది. అయినా మా ఊళ్లో ఎక్కువమంది పనుల కోసం సిటీకి పోకుండా వ్యవసాయ పనులు చేస్తుంటరు. కొంతమంది చేపలు పడుతరు. మా నాన్న ప్రభు గౌడ్ చదువు పదో తరగతి దగ్గరే ఆగిపోయింది. మాకు వ్యవసాయ భూమి లేదు. రెండు గదుల రేకుల ఇల్లు, ఆటో మాకున్న ఆస్తి. ఆటో నడుపుకుంట కుటుంబాన్ని పోషింస్తుండు. నన్ను, తమ్ముడు, చెల్లిని చదివించిండు. ‘బిడ్డా… నా రెక్కల కష్టం మీద మిమ్మల్ని చదివిస్తున్న. రేకుల ఇల్లు, ఆటో తప్ప నాకు ఇంకే ఆస్తి లేదు. మీకంటూ ఏమీ లేదనుకోవద్దు. మీకున్న ఆస్తి చదువే. బాగా సదువుకోని మీ కాళ్ల మీద మీరు నిలబడాలె’ అని నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేటోడు. పదే పదే ఆ మాట చెప్పడం వల్ల బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని అర్థమైంది. చిన్నప్పుడే బాగా చదువుకోవాలనే పట్టుదల పెరిగింది.
బాగా చదవాలని నాన్న చెప్పినట్టే టీచర్లు కూడా చెప్పినరు. నాన్న ప్రోత్సాహం, టీచర్ల స్ఫూర్తితో బడిలో, కాలేజీలో మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్న. ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ చదువు వరకు నేనే క్లాస్ ఫస్ట్! స్కూల్ డేస్ నుంచి డ్రాయింగ్ బాగా వేసేది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టం. టీచర్ల ప్రభావం వల్ల పెద్దయ్యాక టీచర్ కావాలనుకున్న. ఇంటర్ పూర్తి కాగానే డైట్ సెట్ రాసిన. ఆ ఎంట్రన్స్ టెస్ట్‌లో స్టేట్ లెవెల్ నలభై తొమ్మిదో ర్యాంక్ వచ్చింది. నల్లగొండ జిల్లాలో సీటు వచ్చింది. ఫైనాన్షియల్ సపోర్ట్ లేక పోలే. ఇంటికి దగ్గరగా ఉందని, పటాన్‌చెరులోని మంజీరా డిగ్రీ కాలేజ్‌లో చేరిన. ఫైనల్ ఇయర్లో పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన. స్టేట్ లెవెల్లో 20వ ర్యాంక్ వచ్చింది. కోచింగ్‌కి పోకుండానే ఇంత మంచి ర్యాంక్ సాధించిన. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేరిన.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కి వచ్చాక ఖర్చులుండేది. అమ్మ (చంద్రకళ) మా ఇంట్లోనే చిన్న కిరాణం నడిపేది. కానీ కొన్నేళ్లుగా ఆ బిజినెస్ డౌన్ అయింది. చెల్లి బీటెక్ చదువుతున్నది. తమ్మడు బీకామ్ చదువుతున్నడు. ఇంటిలో ఉన్న ఇబ్బందులు తెలిసి నేనే ట్యూషన్స్ చెప్పిన. పాకెట్ మనీ వచ్చేది. కాలేజీ నుంచి రాగానే ఆన్లైన్ ట్యూషన్ చెప్పేది. ఆ తర్వాత భోజనం చేసి చదువుకునేదాన్ని. లైబ్రరీకి పోయి చదువుకోవాలని ఉండేది. కానీ, సాధ్యం కాకపోయేది. సైన్స్ కాలేజ్ లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తెచ్చుకుని రాత్రి తొమ్మిది గంటల వరకు నోట్స్ రాసుకుంట, చదుకుంట ఉండేదాన్ని.
ప్రతి పాఠానికీ సొంతంగా నోట్స్ తయారు చేసుకుంట. మా ఫ్రెండ్స్ కూడా నా నోట్స్ తీసుకునేటోళ్లు. వేరేవాళ్లు ఎట్లున్నరని పోల్చుకోకుండ, పేదరికాన్ని తిట్టుకోకుండ బతకడం మా అమ్మానాన్నలు నేర్పినరు. కాబట్టి నేనెప్పుడూ యూనివర్సిటీ లైఫ్‌లో పేదరికం వల్ల బాధపడలే, భయపడలే. ట్యూషన్స్ చెప్పి మంచిగనే చదువుకున్న. నా కష్టం ఫలించింది. కెమిస్ట్రీలో గోల్డ్ మెడల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చినయి.
నా విజయం చూసి.. ‘ఆస్తులు లేకున్న ఆటో నడిపి, కష్టపడి నా బిడ్డను ఇంత దూరం తీసుకొచ్చిన’ అని గర్వంగా చెప్పుకొన్నడు మా నాన్న. చాలా హ్యాపీగా ఫీలైండు. మా నాన్న నడిపే ఆటో అడ్డా దగ్గర మిగతా ఆటోవాళ్లంతా నా ఫొటోలు, వార్తలు స్టేటస్ పెట్టుకున్నరు. ఆటో డ్రైవర్ బిడ్డకు నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చినయనే వార్త చూసి ఎక్కడెక్కడో ఆటోనడిపేటోళ్లు స్టేటస్లు పెట్టుకున్నరు. వాళ్లు, వీళ్లు చెబుతుంటే మా నాన్నకెంత సంతోషమో నాకూ అంతే సంతోషంగా ఉంది!
– నాగవర్ధన్ రాయల