హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అధికార పార్టీ కండువా కప్పుకొని, ప్రభుత్వ అధికారులను నయానో భయానో బెదిరిస్తూ కీసర, జవహర్‌నగర్, మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో ‘ముఖ్యనేత’ అనుచరుడు సాగిస్తున్న అక్రమ దందాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాను అగ్రనాయకత్వానికి అత్యంత ఆప్తుడినని తన మాటే శాసనమని ప్రచారం చేసుకుంటూ ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను తన జేబులో పెట్టుకొని సమాంతర పాలన సాగిస్తున్నాడనే విమర్శలున్నాయి. ఇటీవల కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం వ్యాపారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన ఇక్కడ జరుగుతున్న అక్రమాల తీవ్రతను తెలియజెప్పింది. దీనిపై స్థానిక ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకోవడం గమనార్హం.
కీసర పీఎస్ పరిధిలో ఇన్నాళ్లు భూ దందాలు, నకిలీ పత్రాలు సృష్టించి ఖాళీ ప్లాట్లు కాజేస్తున్న ముఠాలపై వరుస అరెస్ట్‌లు కొనసాగాయి. ఈ కేసుల్లో ఒక సబ్ రిజిస్ట్రార్‌తో పాటు కొందరు డాక్యుమెంట్ రైటర్లు కూడా అరెస్టయ్యారు. ఈక్రమంలో ఎస్బీ కూడా ఆరా తీసి కీసర స్టేషన్లో అవినీతి పై ఉన్నతాధికారులకు నివేదికను పంపినట్టు సమాచారం. అయినా సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్న ది. ఈ క్రమంలోనే ఇక్కడ అవినీతి, అక్రమా లు, సెటిల్మెంట్ల వెనుక ‘ముఖ్యనేత’ అనుచరుడు కీలకంగా వ్యవహరించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీస్ శాఖలో విస్తృత స్థాయి చర్చ జరుగుతున్నది. ఒక పో లీస్ శాఖనే కాదు.. ఇతర విభాగాల్లోనూ అతడి పాత్ర ఉన్నదని ప్రజలు చెప్తున్నారు. సమస్యలు సృష్టించి, వాటిని పోలీసుల ద్వారా సెటిల్మెంట్లు చేసి, వాటాలు పంచుకుంటారనే ప్రచారం నడుస్తున్నది.
రియల్ ఎస్టేట్ దందాలు చేసే ఈ అనుచరుడికి, ముఖ్యనేతకు మధ్య పాత సంబంధాలతో నే అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. 2020లో ఒక తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కిన సమయంలో ఆయనకు సహకరించిన వారి గురించి ఆరా తీయడంతో ఒక పెద్ద ముఠా వ్యవహారమే బయటకు వ చ్చింది. అందులో కీలకంగా వ్యవహరించిన ఈ అనుచరుడి ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు చే పట్టింది. అప్పట్లో సదరు ముఖ్యనేత ఎంపీగా ఉండటం, ఆయన లెటర్ హెడ్లు, ఆర్టీఏ లేఖ లు, పలు భూముల వివరాలు ఏసీబీకి చిక్కా యి. నాటి కేసులో ఆ ముఖ్యనేతకు ఎలాంటి సంబంధం లేదని, మొత్తం భారమంతా అనుచరుడు తనపైనే వేసుకున్నాడనే టాక్ వచ్చింది.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, అందుకే ఇప్పుడు రెచ్చి పోయి ప్రవర్తిస్తున్నాడని తెలుస్తున్నది. ప్రస్తు తం కీసర, జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంలో బిజీగా ఉ న్నాడని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు అందరూ ఇత డి చెప్పు చేతుల్లోనే ఉంటారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే కీసర పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించి బాధితులను జవహర్‌నగర్ పీఎస్‌లో నిర్బంధించి సెటిల్మెంట్లు కూడా చేశారనే ఆరోపణలున్నాయి. పోలీసులతో స్థానిక రియల్ వ్యాపారులను బెదిరించి సెటిల్మెంట్లు చేస్తూ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇక్కడికి వెళ్లిన అధికారులు నిజాయితీగా ఉండి పనిచేయాలంటే కుదరదని, తాను చెప్పినట్టు చేస్తేనే ఇక్కడుండాలని, అన్ని విధాలుగా అండదండలు అందిస్తానని, తనకు అన్నింట్లో సహకరించాలనే ఒప్పందాలు చేసుకొని మరీ ఇక్కడ పోలీసు అధికారులను తన నియంత్రణలోకి తెచ్చుకుంటాడని స్థానికంగా చర్చనడుస్తున్నది. ఇందులో భాగంగానే నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసి ఒక సబ్‌రిజిస్ట్రార్‌ను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేసేందుకు రూ.4 లక్షల వరకు వసూలు చేశారని, నాలుగు నెలల తర్వాత అరెస్ట్ చేశారని, మరో సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యనేత అనుచరుడు కావడంతో ఉన్నతాధికారులు సైతం ఇతడి మాట వింటారనే చర్చ నడుస్తున్నది. తాము అతడి మాట వినకపోతే ముఖ్యనేత వద్దకే వెళ్లే స్థాయిలో ఉన్నాడని, తమకెందుకు వచ్చిన గొడవ అనే ధోరణితో ఉన్నతాధికారులు సైతం అతడి ఆగడాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారనేది చర్చనీయాంశమైంది.
కీసర ప్రాంతంలో జరుగుతున్న అవినీతి బాగోతంపై ఎస్బీ నివేదికలు ఇచ్చిన విషయం తెలుసుకొని తమ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఉన్నతాధికారులకు సైతం ముఖ్యనేత అనుచరుడు సూచనలు చేయడం, అధికారులు సైతం సరే అని తల ఊపడంపై పోలీస్ శాఖలో చర్చ నడుస్తున్నది. ఇక్కడ ముఖ్యనేత అనుచరుడి ఆగడాలపై దర్యాప్తు జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయంటూ స్థానికులు చెప్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు కొందరు తలొగ్గి చట్టాన్ని అతిక్రమించి వారికి సహకరిస్తున్నారని, అలాకాకుండా తాము చట్టప్రకారమే నడుచుకుంటామంటూ ఇలాంటి నేతలకు కచ్చితంగా చెప్పి దూరంగా ఉంచాలంటూ పోలీస్ శాఖలోని కొందరు అధికారులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.