టెహ్రాన్, జూన్ 23: తమ అణు కేంద్రాల మీద అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సోమవారం ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్, ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అగ్రరాజ్యం దురాక్రమణకు వ్యతిరేకంగా ఆపరేషన్ ‘బెషారత్ ఫతాహ్’ను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదీద్పై క్షిపణులతో దాడిచేసినట్టు ఇరాన్ టీవీ వెల్లడించింది. అల్ ఉదీద్ పశ్చిమాసియాలోనే అమెరికాకు ఉన్న అతిపెద్ద సైనిక స్థావరం. ఖతార్ రాజధాని దోహాకు వెలుపల ఉన్న ఈ స్థావరంలో సుమారు 10వేల మంది అమెరికన్ సైనికులు ఉన్నట్టు అంచనా. పశ్చిమాసియా ప్రాంతంలో తన సైనిక వ్యవహారాలకు ఈ కేంద్రం అమెరికాకు ఎంతో కీలకమైనది.
దోహా సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వెలువడినట్టు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్, ఏఎఫ్‌పీ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఖతార్ తన గగనతలాన్ని మూసివేసింది. సురక్షిత స్థానాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్లు ఖతార్‌లోని తమ పౌరులకు సూచించాయి. మరోవైపు ఇరాక్‌లోని అయిన్ అల్ అసద్ బేస్‌పైనా ఇరాన్ రాకెట్లు ప్రయోగించింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఈ దాడులు ప్రమాదకరమైన మలుపుగా నిపుణులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరించే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు.
ఆదివారం తెల్లవారు జామున తమ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన వెంటనే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అందులో భాగంగానే అమెరికా సైనిక స్థావరంపై క్షిపణి దాడికి పాల్పడింది. అయితే ఇది మొదటి దాడి మాత్రమేనని ఇరాన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. తమ అణుకేంద్రాలపై దాడికి అమెరికా ఎన్ని బాంబులను ఉపయోగించిందో తాము కూడా తమ ప్రతీకార దాడిలో అదే సంఖ్యలో బాంబులను ఉపయోగించామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి తెలిపింది. ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే సిట్యుయేషన్ రూమ్‌కు చేరుకున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సైనిక దళాల ముఖ్యుల చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ఉన్నట్టు తెలిపాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకున్న అనంతరం ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమ భూభాగంపై ఇరాన్ జరిపిన దాడిని ఖతార్ ఖండించింది. ఈ దాడి తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇరాన్ జరిపిన దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా తప్పి కొట్టామని, తమ గగనతల రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే విధంగా తాము దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేయనున్నట్టు వెల్లడించారు. అయితే ఈ దాడులపై ఇరాన్ ముందుగానే ఖతార్‌ను హెచ్చరించినట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది.
సిరియాలోని హసకా ప్రావిన్సులో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై కూడా దాడి జరిగినట్లు మెహర్ న్యూస్ సోమవారం వెల్లడించింది. ఇరాన్ అనుకూల గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై అమెరికా నుంచి ఎటువంటి ధ్రువీకరణ రాలేదు. అలాగే ఇరాన్ కూడా ఈ దాడికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను అమెరికా కట్టుదిట్టం చేసింది. అమెరికా భద్రతా దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఖతార్‌లోని అమెరికా బేస్‌పై ఇరాన్ దాడి నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ గగనతలాల్ని మూసివేశాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తమ గగనతలాల్ని మూసివేస్తున్నట్టు ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ ప్రకటించాయి. కాగా, ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇండియా-ఖతార్ వెళ్లే రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిరిండియా ఈ సర్వీసులను నడుపుతున్నాయి.
అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్‌లోని భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండగని, ఇండ్లకే పరిమితం కావాలని సూచించింది. స్థానిక వార్తలను ఫాలో అవ్వాలని, ఖతార్ అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని కోరింది. తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని పేర్కొన్నది.