Iran : పశ్చిమాసియా యుద్దంలో చర్చల ఊసెత్తని ఇరాన్ ‘తగ్గేదేలే’ అంటోంది. హర్మూజ్ జలసంధి(Hormuz Strait)ని తెరవకుంటే భీకర దాడులకు పాల్పడుతామని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్చరికను ఆదేశం చాలా తేలికగా తీసుకుంది. గతంలో తమ దేశంపై దాడి చేసి అమెరికా విఫలమైన విషయాన్ని పలు దేశాల్లోని ఇరాన్ దౌత్య కార్యాలయాలు గుర్తు చేశాయి. తమను భయపెట్టాలని చూస్తే చరిత్ర పునరావృతమవుతుందని అమెరికాను బెదిరించాయి.
హర్మూజ్ జలసంధి విషయమై ఇరాన్‌కు మరోసారి డెడ్ లైన్ విధించిన డొనాల్డ్ ట్రంప్ మాట వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అద్భుతమైన ఆపరేషన్‌తో తమ యుద్ధ విమాన పైలెట్‌ను సురక్షితంగా తీసుకొచ్చామని ట్రుత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తెరవకుంటే మంగళవారం ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలు ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు.
Donald J. Trump Truth Social 04:05.26 08:03 AM EST pic.twitter.com/9NfbSE7VKB
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 5, 2026
‘మంగళవారం పవర్ ప్లాంట్, బ్రిడ్జ్ రోజు. ఇరాన్‌లోని అన్నింటిని మడతపెట్టేస్తాం. ఈ దాడి భయానకంగా ఉంటుంది. బాస్టర్డ్స్ ఇకనైనా హర్మూజ్ జల సంధిని తెరవండి లేదంటే మిమ్మల్ని నరకానికి పంపిస్తాను చూస్తూ ఉండండి. ఆల్లాను ప్రార్ధించుకోండి’ అని ట్రంప్ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు.
Judging by how POTUS swears like a teenager, it seems the US has reached the Stone Age sooner than expected.
— Iran Embassy in Thailand ☫ (@IranInThailand) April 5, 2026
అమెరికా అధినేత పోస్ట్‌కు కౌంటర్ ఇచ్చిన ఇరాన్ తాము అమెరికా పైలెట్ రెస్క్యూ ఆపరేషన్‌ను భగ్నం చేశామని ప్రకటించింది. ఇదుగో సాక్ష్యం అంటూ యూఎస్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తున్న ట్రంప్ చరిత్రను గుర్తు పెట్టుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా యూఎస్ ప్రత్యేక దళాలు చేపట్టిన ఆపరేషన్ ఈగిల్ క్లా విఫలమైందనే విషయాన్ని గుర్తు చేసింది.
‘చరిత్ర దానికదే పునరావృతమవుతుంది. 1980 ఏప్రిల్ 24న ఇరాన్‌లోని టబాస్ ఎడారిలో అమెరికా సైన్యం చేపట్టిన చరిత్రాత్మక ఆపరేషన్ ఈగిల్ క్లా విఫలమైంది. ట్రంప్ గొప్పగా చెబుతున్న అమెరికా పైలెట్ రెస్క్యూ ఆపరేషన్ మోసపూరితంగా జరిగింది. మా సైన్యాలు రావడంతో అమెరికా తోకముడించింది’ అని ఇరాన్ దౌత్య కార్యాలయం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.