న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అమెరికా నుంచి వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ సోమవారం తిరస్కరించింది. తన ప్రతిస్పందనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తెలియచేసినట్లు ఇరాన్ అధికారిక వార్తాసంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ(ఇర్నా) తెలిపింది. తాత్కాలిక ఒప్పందానికి ఇరాన్ ఇష్టపడడం లేదని, యుద్ధానికి శాశ్వత ముగింపు అవసరమని స్పష్టం చేస్తున్నట్లు ఇరాన్ స్పందన తెలియచేస్తున్నది. ఇరాన్ తన సమాధానంలో తక్షణ కాల్పుల విరమణతోపాటు 10 నిబంధనల ప్రణాళికను పొందుపరిచింది. ఇందులో పశ్చిమాసియా ప్రాంతమంతటా ఘర్షణలను అంతం చేయడం, హొర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి భరోసా ఇచ్చే నిబంధనలు అమలుచేయడం, ఇరాన్ పునర్నిర్మాణానికి సంబంధించిన ఆంక్షలు, నిబంధనలు ఎత్తివేయడం వంటి డిమాండ్లు ఉన్నాయి.
తాము కేవలం కాల్పుల విరమణను మాత్రమే ఆమోదించబోమని కైరోలోని ఇరాన్ దౌత్య కార్యాలయ అధిపతి మొజ్తబా ఫిర్దౌసీ పోర్ సోమవారం అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. ఇరాన్‌పై మళ్లీ దాడి జరగదన్న హామీలతో కూడిన యుద్ధ ముగింపును తాము ఆమోదిస్తామని ఆయన స్పష్టం చేశారు. గడువులోగా ఒప్పందానికి అంగీకరించకపోతే ఇంధన, మౌలిక సదుపాయాలను బాంబులతో పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ స్పందన వెలువడింది.
కాగా, పాకిస్థాన్ బలపరుస్తున్న కాల్పుల విరమణ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్న అనేక ఆలోచనలలో ఒకటని వైట్ హౌస్ అధికారి ఒకరు సోమవారం సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ దీనికి ఆమోదం తెలపలేదని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సమాచార మార్పిడి మార్గాలను తెరచి ఉంచడానికి పాకిస్థాన్ తెరవెనుక నుండి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నది. పాకిస్థాన్‌తోపాటు ఈజిప్టు, తుర్కియే కూడా ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య ప్రత్యక్ష సందేశాల మార్పిడికి దోహదపడుతున్నాయి.
తన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెంటనే స్పందించారు. ఇరాన్ స్పందనతో తాను చాలా కలత చెందానని ఆయన తెలిపారు. ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమైన పక్షంలో ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తూ తాను విధించిన గడువు సమీపిస్తున్న వేళ తను తీసుకునే వైఖరి ఎంత కఠినంగా ఉండగలదో ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్‌కు విధించిన మంగళవారం గడువులో ఎటువంటి మార్పు ఉండబోదని, అదే ఫైనల్ అని ట్రంప్ స్పష్టం చేశారు. వారు చేయాల్సింది చేస్తే ఇది(యుద్ధం) చాలా త్వరగా ముగిసిపోవచ్చు అని ఇరాన్‌ని ఉద్దేశించి ట్రంప్ చెప్పారు. వారు కొన్ని పనులు చేయాల్సిందే. ఆ విషయం వారికి తెలుసు. మొదటి, రెండవ దశలలో ఉన్న ఉన్మాదులతో పోలిస్తే అక్కడి ప్రజలు చాలా తెలివైనవారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
హొర్ముజ్ జలసంధిని తెరువడం గురించి ఆదివారం ట్రూత్ సోషల్ పోస్టులో తాను ఉపయోగించిన కొన్ని బూతు పదాలపై వెల్లువెత్తిన విమర్శల గురించి విలేకరులు ప్రశ్నించగా తన వాదనను నొక్కి చెప్పడానికే తాను అలాంటి అసభ్యకరమైన భాషను ఉపయోగించానని, కేవలం తన వాదనను నిరూపించుకోవడానికే తాను ఆ పనిచేశానని ట్రంప్ తన చర్యను సమర్థించుకున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల(ఈడీటీ) (0000 జీఎంటీ) లోపు ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌కు నరకం సృష్టిస్తామనే బెదిరింపులతో సహా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిర్దంద్వంగా తిరస్కరించిన ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ అమెరికా, దాని మిత్ర దేశాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమపై రోజురోజుకూ దాడులు తీవ్రమవుతుండడాన్ని ఆయన ప్రస్తావిస్తూ బెదిరింపులు, దాడులు, ఐఆర్జీసీ కమాండర్లు లక్ష్యంగా హత్యలు ఇరాన్ సైనిక బలగాలను బలహీనపర్చ లేవని స్పష్టం చేశారు. ఇరాన్‌ను రాతియుగానికి పంపుతామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. అది అతని నిర్లక్ష్య వైఖరిని చూపుతున్నదని విమర్శించారు. యూఎస్, ఇజ్రాయెల్ దళాలు పౌరుల మౌలిక సదుపాయాలైన స్కూళ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు లక్ష్యంగా దాడులు చేస్తూ తమపై ఒత్తిడి చేస్తున్నా ఇరాన్ మిలిటరీ బలం ఏ మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నాయని అన్నారు.
ఒప్పందంపై ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ మంగళవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు. యావత్ ఇరాన్ మొత్తాన్ని ఒక్క రాత్రిలో నాశనం చేయగలమని, అది కూడా మంగళవారం సాయంత్రమే కావొచ్చని పేర్కొన్నారు. ఎఫ్-15 ఫైటర్ జెట్ కూలిన సందర్భంగా పైలట్‌ను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ గురించి ట్రంప్ విలేకరులకు వివరించారు. ఇటీవలి కాలంలో నిర్వహించిన అత్యంత రిస్కీ ఆపరేషన్ ఇదని తెలిపారు. మొదటి దశలో 21 హెలికాప్టర్లు పాల్గొన్నాయని చెప్పారు. ఇక రెండో దశలో బాంబర్లు, జెట్లు, రీఫ్యూయెలింగ్ ట్యాంకర్లు, రెస్క్యూ యూనిట్స్ సహా 155 ఎయిర్‌క్రాఫ్ట్‌లో పాల్గొన్నాయని వివరించారు. పట్టపగలు ఇరాన్ గడ్డపై కొన్ని గంటలపాటు ఆపరేషన్ సాగిందని చెప్పారు.