(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఇరాన్‌లోని చమురు క్షేత్రాలు, పవర్ ప్లాంట్లపై ఐదు రోజులపాటు దాడులను నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఇరాన్-ఇజ్రాయెల్ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరు దేశాలూ పరస్పర దాడులకు దిగాయి. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయగా.. ఐఆర్జీసీ హెడ్‌క్వార్టర్స్, గ్యాస్ ప్లాంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు, అమెరికాతో చర్చించడానికి ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. తటస్థ దేశాల నౌకలు హొర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతిస్తూ ఇరాన్ కీలక ప్రకటన చేసింది.
విరుచుకుపడ్డ ఇరాన్
ట్రంప్ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్, ఇలాట్, డిమోనా నగరాలతో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలతో పాటు కువైట్‌లోని విద్యుత్తు లైన్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. 100 కిలోల పేలుడు పదార్థాలను మోసుకొచ్చిన క్షిపణులు పలు భవనాలను ధ్వంసం చేశాయని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. టెల్ అవీవ్‌పై జరిగిన దాడుల్లో పలువురు గాయపడ్డట్టు సమాచారం. తెల్లవారుజాము నుంచే ఇజ్రాయెల్‌లోని పలు నగరాల్లో సైరన్ల మోత మోగింది.
ఇజ్రాయెల్ ప్రతిదాడులు ఇలా..
ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో ఉన్న గ్యాస్ వ్యవస్థతో పాటు ఖొర్రమ్షహర్లోని ఓ పవర్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఇరాక్‌లో ఇరాన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న పాపులర్ మొబిలైజేషన్ (పీఎంఎఫ్) కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న హెజ్బొల్లా గ్రూప్ లక్ష్యంగా బీరుట్‌లోని దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్లతో విరుచుకుపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ దాడుల్లో పలు మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్టు సమాచారం.
చర్చలపై సస్పెన్స్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాతో చర్చలకు అంగీకరించినట్టు సౌదీ అరేబియాకు చెందిన అల్ అరేబియా ఇంగ్లిష్ ఛానల్ వెల్లడించింది. అంతేకాకుండా, అమెరికాతో ఒప్పందాన్ని కూడా ఆయన కుదుర్చుకొన్నట్టు తెలిపింది. అయితే, దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలని, బాలిస్టిక్ క్షిపణుల శక్తి-సామర్థ్యాల పరీక్షలను ఆపేయాలంటూ అమెరికా విధించే కీలక షరతులకు ఇరాన్ ఒప్పుకోకపోవచ్చని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ఈ డీల్ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు, ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు పాకిస్థాన్ వేదికగా జరుగనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను శ్వేతసౌధం ఖండించింది. ఇరాన్‌కు చెందిన ఓ గౌరవప్రదమైన నేతతో తమ దేశ ప్రతినిధులు చర్చలు మొదలుపెట్టినట్టు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. కాగా.. దాడులకు సంబంధించి ట్రంప్ సోమవారం చేసిన ప్రకటనను ఇరాన్‌కు చెందిన మీడియా ప్రధానంగా ప్రసారం చేసింది. ఇరాన్‌కు భయపడే ట్రంప్ వెనక్కి తగ్గారని ఎద్దేవా చేసింది.
ముందస్తు అనుమతి ఉంటే వెళ్లొచ్చు
హొర్ముజ్‌లో చమురు రవాణాపై ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకొంటూ.. తటస్థ దేశాలకు చెందిన నౌకలు హొర్ముజ్ గుండా వెళ్లొచ్చని పేర్కొన్నది. అయితే, దీనికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వెల్లడించింది. మరోవైపు, హొర్ముజ్ జలసంధిలో అమెరికా, థాయిలాండ్ నౌకలపై ఇరాన్ చేసిన దాడులు ఉద్దేశపూర్వకంగా చేసినవేనని హ్యూమన్ రైట్స్ వాచ్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా బహ్రెయిన్‌లో కొన్ని డ్రోన్లు కలకలం సృష్టించాయి. దీంతో తమ వెబ్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్టు అమెజాన్ పేర్కొన్నది.
మోదీకి ట్రంప్ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో హొర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతపై ఇరువురూ చర్చించుకొన్నారు.
యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?
ఇరాన్‌పై ఇజ్రాయెల్ సాగిస్త్తున్న యుద్ధంలో సౌదీ అరేబియా, యూఏఈ పాల్గొనేందుకు సిద్ధమైనట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇరాన్‌కు చెందిన ఓ దవాఖానను, క్లబ్‌ను యూఏఈ మూసేయడం, తమ వైమానిక స్థావరాలను వాడుకొనేందుకు అమెరికా సైన్యానికి సౌదీ అనుమతినివ్వడాన్ని ఈ మేరకు ఉదహరించింది. మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ చేస్తున్న యుద్ధానికి రష్యా ఇంటెలిజెన్స్ సాయాన్ని అందిస్తున్నదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు.