టెహ్రాన్, మార్చి 25 : అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ బుధవారం ప్రకటించింది. అయితే దీనిపై అమెరికా అధికారుల నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. అమెరికా విమాన వాహక నౌక దిశగా కోస్టల్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ సైనిక పౌర సంబంధాల శాఖ తెలిపింది. అబ్రహం లింకన్ తమ నిఘా నేత్రాల పరిధిలో ఉందని, ఇరాన్ తీరాన్ని సమీపిస్తే దాడి చేస్తామని ఇదివరకు ఇరాన్ నౌకాదళం హెచ్చరించింది. ఇరాన్ క్షిపణి వ్యవస్థల పరిధిలోకి ప్రవేశించిన పక్షంలో యుద్ధ నౌకపై తమ నౌకాదళం దాడి చేస్తుందని ఇరాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ షాహరం ఇరానీని ఉటంకిస్తూ ప్రభుత్వ ప్రసార మాధ్యమం ప్రెస్ టీవీ తెలిపింది. అమెరికా గతంలో వ్యూహాత్మక శక్తిగా వర్ణించింది ఇప్పుడు వ్యూహాత్మక ఓటమిగా మారిందని ఇరాన్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ ఎహ్రహిం జోల్ఫాగారి వ్యాఖ్యానించినట్లు ప్రెస్ టీవీ తెలిపింది.
రానున్న రోజుల్లో 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన కనీసం 2,000 మంది పారాట్రూపర్లను అమెరికా పశ్చిమాసియాకు పంపనున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్‌కు అమెరికన్ వర్గాలు తెలిపాయి. ఈ బలగాలు నేరుగా శత్రు భూభాగంలో దూకి ఆ ప్రదేశాన్ని, వైమానిక స్థావరాలను స్వాధీనం చేసుకోగల శిక్షణ పొందాయని వారు చెప్పారు. కాగా, మరో 5,000 మంది నౌకాదళ సిబ్బందిని, 1,000 మంది నావికులను పశ్చిమాసియాకు పంపే ప్రక్రియను అమెరికా రక్షణ శాఖ కార్యాలయం(పెంటగాన్) చేపట్టినట్లు వారు చెప్పారు.
ఇరాన్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ వాయువ్య నగరం ఖాజ్విన్పై వైమానిక దాడులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ఇరాన్ కూడా దాడులు ఉధృతం చేయడంతో ఇజ్రాయెల్‌లో అనేకసార్లు సైరన్లు మోగాయి. తన పొరుగుదేశాలైన గల్ఫ్‌పై కూడా ఇరాన్ ఒత్తిడిని కొనసాగించింది. చమురు సంపన్న తూర్పు ప్రావిన్సులో కనీసం 8 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. బహ్రెయిన్‌లో కూడా సైరన్లు మార్మోగాయి. అనేక డ్రోన్లను కూల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడిన ఓ డ్రోన్ కారణంగా మంటలు చెలరేగినట్లు పౌర విమానయాన సంస్థ తెలిపింది. అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పుతున్నట్లు తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 1,500 మందికిపైగా మరణించినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లో 16 మంది మరణించగా, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గల్ఫ్ దేశాల్లో డజను మందికిపైగా పౌరులు మరణించారు. ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపుపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,000 మందికిపైగా మరణించినట్లు లెబనాన్ అధికారులు వెల్లడించారు.