iPad saves Father and Daughter | ఆన్లైన్లో గేమ్స్ ఆడుకోవడం కోసం తీసుకెళ్లిన ఐప్యాడ్.. తండ్రీకూతుళ్ల ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక కుటుంబం వద్ద చిన్నసైజు విమానం ఉంది. ఆ కుటుంబంలో 58 ఏళ్ల తండ్రి మాజీ పైలట్.
ఈ క్రమంలోనే ఆ చిన్న విమానంలో కూతున్ని ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అలా వెళ్లిన కాసేపటికే ఆ విమానం రాడార్ల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆ తండ్రీకూతుళ్ల కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. చివరగా విమానం సిగ్నల్ కనిపించిన ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. వీరికి సుమారు 50 మంది వాలంటీర్లు కూడా సాయం చేశారు.
అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అలాంటి సమయంలో విమానం నడిపిన వ్యక్తి దగ్గర మొబైల్ ఉన్నట్లు తెలుసుకొని దాని జీపీఎస్ లొకేషన్ కనుక్కోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ లొకేషన్ సరిగ్గా తెలియలేదు. అప్పుడే విమానంలో ఉన్న 13 ఏళ్ల బాలిక వద్ద ఐప్యాడ్ ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు.. దాని లొకేషన్ ట్రేస్ చేశారు.
అప్పుడు విక్స్-బార్ స్క్రాంటన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆగ్నేయ దిశగా విమానం కూలినట్లు తెలిసింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు.. గాయాలపాలై స్పృహకోల్పోయిన తండ్రీకూతుళ్లను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.