Indonesia | ఇండోనేషియాలోని (Indonesia) జావా ద్వీపంలో (Java island) ఉన్న మౌంట్ మెరాపీ (Mount Merapi volcano) అనే అగ్నిపర్వతం విస్ఫోటనం (Eruption) చెందింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా (lava), బూడిద, వేడి వాయువులు (gas clouds) వెలువడుతున్నాయి. విస్ఫోటనం ధాటికి గాలిలో వంద మీటర్ల ఎత్తు వరకు ధూళి మేఘాలు ఆవరించాయి.
ఇక అగ్నిపర్వతం నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో వాయువులు వ్యాప్తిచెందాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధికార ప్రతినిధి అబ్దుల్ ముహరీ (Abdul Muhari) తెలిపారు. రోజంతా లావా, బూడిద ఎగసిపడటంతో ధూళి మేఘాలు సూర్యుడిని కమ్మేశాయని, పలు గ్రామాలను బూడిద కప్పేసిందని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదన్నారు.
ఇండోనేషియాలోని 120 క్రియాశీలక అగ్నిపర్వతాల్లో మెరాపీ ఒకటి. జావా ద్వీపంలోని యోగ్యకర్త నగరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంది. ఇది గతంలో 2020, ఇదే నెలలో బద్దలైంది. ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద కమ్మేసింది. ఇక 2010లో ఈ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. దీంతో 347 మంది మరణించారు. సుమారు 20 వేల మందిని ఇతర గ్రామాలకు తరలించారు.