జకర్తా: ఇండోనేషియాలో సుమారు వంద మంది చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆ దేశంలో అన్ని రకాల సిరప్లు, ద్రవరూప మందులను బ్యాన్ చేశారు. ఇటీవల గాంబియాలో సిరప్లు తాగి సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్ని వారాల్లోనే ఇండోనేషియాలో ఇలా జరగడం శోచనీయం. కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసే రసాయనాలు సిరప్ మందులో ఉన్నట్లు ఇండోనేషియా పేర్కొన్నది. దీని వల్లే ఈ ఏడాది 99 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
చిన్నారుల మరణానికి కారణమైన మందులను దిగుమతి చేసుకున్నారా లేక ఇండోనేషియాలో స్థానికంగా ఉత్పత్తి చేశారా అన్న విషయం ఇంకా తెలియదు. దాదాపు 200 మంది చిన్నారుల్లో గురువారం కిడ్నీ సమస్యలను గుర్తించినట్లు ఇండోనేషియా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయిదేళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలిపారు.
దగ్గు సిరప్‌లను వాడవద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని వారాల క్రితం ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. గాంబియాలో 70 మంది చిన్నారులు మృతిచెందిన తర్వాత ఆ వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో తయారైన సిరప్‌ల వల్ల ఆ విషాదం మరణాలు చోటుచేసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. దగ్గు సిరప్‌లలో డైఇథలీన్ గ్లైకాల్, ఇథలీన్ గ్లైకాల్‌లు అధిక మోతాదుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనాల వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నట్లు అంచనా వేస్తున్నారు.