Megha Vemuri | మసాచుసెట్స్, మే 30: ఒక వైపు పాలస్తీనా అనుకూల వైఖరితో వ్యవహరించే విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కక్షగట్టి దేశ బహిష్కరణ విధిస్తున్న క్రమంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గ్రాడ్యుయేషన్ డేలో భారత సంతతికి చెందిన మేఘా వేమూరి చేసిన ప్రారంభ ప్రసంగం సంచలనం సృష్టించింది. ఎంఐటీ క్లాస్ 2025 అధ్యక్షురాలు అయిన మేఘా వేమూరి పాలస్తీనా సంఘీభావానికి ప్రతీక అయిన కెఫియే ధరించి ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్‌తో విశ్వవిద్యాలయ సంబంధాలను ఆమె తన ప్రసంగంలో నిశితంగా విమర్శించారు. ఎంఐటీ విద్యార్థులు స్వేచ్ఛ పాలస్తీనాను కోరుకుంటున్నారని పేర్కొనడమే కాక, మారణ హోమానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌తో ఎంఐటీ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకోవడమేమిటని ఆమె ప్రశ్నించింది.
పాలస్తీనా ప్రజలకు ఎంఐటీ విద్యార్థులు అండగా నిలవడాన్ని ఆమె ప్రశంసిస్తూ మారణహోమాన్ని తామెంతమాత్రం సహించమని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంపుకోవడానికి విద్యార్థులు ఇటీవల చూపుతున్న చొరవను ఆమె ప్రశంసించారు. ‘మీరు గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. కా్ంయపస్లో పాలస్తీనా అనుకూల కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. మీరు అన్ని దిశల నుంచి, ముఖ్యంగా మీ సొంత విద్యాలయ అధికారుల నుంచి బెదిరింపులు, అణచివేతను ఎదుర్కొన్నారు. కానీ మీరు విజయం సాధించారు’ అని ఆమె విద్యార్థులను ప్రశంసించారు. తనకు తెలిసి ఎంఐటీ సంఘం ఎన్నడూ మారణహోమాన్ని సహించదని ఆమె పేర్కొన్నారు.