Canada | కెనడాలోని టొరంటోలో భారతీయులపై వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. భారతీయ యువతి హిమాన్షి ఖురానా హత్య ఘటన మరవకముందే టొరంటోలో మరో విషాదం నెలకొంది. 20 ఏండ్ల శివాంక్ అవస్థిని దుండగుడు కాల్చి చంపడం కలకలం రేపింది.
శివాంక్ స్కార్‌బొరౌగ్ యూనివర్సిటీలో లైఫ్ సైన్సెస్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక హైల్యాండ్ క్రీక్ టెయిల్ వద్ద డిసెంబర్ 23వ తేదీన ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివాంక్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాల్పుల విషయం తెలుసుకుని తాము అక్కడికి వెళ్లేసరికి దుండగుడు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శివాంక్ హత్య నేపథ్యంలో యూనివర్సిటీ కాలేజీ క్యాంపస్‌ను కాసేపు మూసివేశారు. ఈ ఘటనతో ఈ ఏడాది కెనడాలో హత్యల సంఖ్య 41కి చేరినట్లు అధికారులు తెలిపారు.
శివాంక్ హత్యపై కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టొరంటో స్కార్బోరౌగ్ క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి శివాంక్ మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొంది. ఈ కష్టకాలంలో మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.