Krishangi Meshram | లండన్, ఆగస్టు 18: ఇంగ్లండ్‌లో అతిపిన్న వయస్కురాలైన సొలిసిటర్గా భారత సంతతి లా గ్రాడ్యుయేట్ క్రిశాంజి మిశ్రం (Krishangi Meshram) అసాధారణమైన ఘనతను సాధించారు. అతి చిన్న వయసులో (21ఏ౦డ్లలో) ఇంగ్లండ్, వేల్స్లో సొలిసిటర్ అయ్యారు. ఇక్కడి ‘ద ఓపెన్ యూనివర్సిటీ’ నుంచి 18 ఏండ్ల వయసులో లా గ్రాడ్యుయేషన్ అందుకున్న ఆమె, ఓ వైపు సింగపూర్ కంపెనీలో పనిచేస్తూనే కేవలం మూడేండ్లలో న్యాయవాదిగా అర్హత సాధించారు.
పశ్చిమ బెంగాల్ మాయాపూర్‌కు చెందిన మిశ్రం ప్రస్తుతం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్నారు, న్యాయ విద్యపై ఇష్టంతో 15 ఏండ్ల వయసులో ఇంగ్లండ్ మిల్టన్ కేన్స్‌లోని ఓపెన్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఇప్పుడు అర్హత కలిగిన న్యాయవాదిగా మారడానికి అన్ని పరీక్షలను పూర్తిచేశాను. ఇక నా తదుపరి లక్ష్యం.. స్పెషలైజేషన్ పూర్తిచేయటం. బిజినెస్, ప్రైవేట్ క్లయింట్స్‌కు న్యాయవాదిగా మారాలని అనుకుంటున్నా’ అని అన్నారు.