బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఓ యువతిని కిడ్నాప్ చేసి, రోజుల తరబడి ఆమెను చిత్రహింసలకు గురిచేసి, రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ కోవడం న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
గగన్‌దీప్ సింగ్ (34)పై రెండు అత్యాచారం, కిడ్నాప్, చిత్రహింసల కింద కేసులు నమోదయ్యాయి. వీటిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిపిన లండన్‌లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు.. గగన్‌దీప్‌ను దోషిగా తేల్చింది. తాజాగా అతనికి 34 ఏళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ఇందులో 28 ఏళ్లు సంవత్సరాలు జైలులోనే గడపాల్సి ఉండగా.. అనంతరం ఆరేళ్ల పాటు కఠిన నిబంధనల మధ్య పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. కనీసం 18 ఏళ్లు లేదా విధించిన జైలు శిక్షలో కనీసం మూడింట రెండొంతుల వరకు పూర్తయ్యేంత వరకు అతనికి పెరోలు కూడా లభించదని కోర్టు స్పష్టం చేసింది.
థాయిలాండ్ నుంచి యూకేకు ఒక సూట్‌కేసును తీసుకురావాలని ఓ 24 ఏళ్ల యువతిని 2024 జూన్‌లో కొంతమంది అడిగారు. అయితే అందులో ఏం వస్తువులు ఉన్నాయో సరిగ్గా చెప్పకపోవడంతో సదరు యువతి సూట్ కేసు తీసుకొచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె థాయిలాండ్ నుంచి బర్మింగ్‌హామ్ విమానాశ్రయానికి చేరుకోగానే కొందరు మాస్కులు ధరించి దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి లండన్‌కు తీసుకెళ్లారు.
పశ్చిమ లండన్‌లోని హాన్వెల్ ప్రాంతంలోని ఒక ఇంట్లో యువతిని బంధించారు. ఆమెను రోజుల తరబడి తీవ్రంగా హింసిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలోనే గగన్‌సింగ్ ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితురాలు.. ముందుగా పోలీసులకు విషయం చెప్పేందుకు వెనుకాడింది. చివరకు తల్లి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.