టొరంటో: అమెరికా, కెనడా బోర్డర్ వద్ద గడ్డకట్టే చలిలో చిక్కుకుని నలుగురు భారతీయులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ నలుగురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. భారత్‌లోని గుజరాత్ రాష్ట్రానికి చెందినట్లు కెనడా పోలీసులు తేల్చారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆ కుటుంబం కెనడాలో తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అమెరికా బోర్దర్ వద్దకు వాళ్లను ఎవరు తీసుకువచ్చారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మానవ అక్రమ రవాణా కేసుగా భావిస్తున్నారు.
మరణించిన వారిని జగదీశ్ బల్దేవ్భాయ్ పటేల్(39), వైశాలీబెన్ జగదీశ్‌కుమార్ పటేల్(37), విహంగి జగదీశ్‌కుమార్ పటేల్(11), ధార్మిక్ జగదీశ్‌కుమార్ పటేల్(3)గా గుర్తించారు. అందరూ ఒకే ఫ్యామిలీకి చెందినవాళ్లు. కెనడా-అమెరికా బోర్డర్‌కు 12 మీటర్ల దూరంలో ఉన్న మనిటోబాలోని ఎమర్సన్ వద్ద ఆ నలుగురి మృతదేహాలను గుర్తించారు. అయితే వీరిది గుజరాత్‌లోని కాలోల్ సమీపంలోని దింగుచా గ్రామం. జనవరి 26వ తేదీ అటాప్సీ నిర్వహించినట్లు కెనడా అధికారులు తెలిపారు. చలికి ఎక్స్పోజ్ కావడం వల్ల ఆ నలుగురు మృతిచెందినట్లు మనిటోబా వైద్యులు తెలిపారు. మరణించినవారి దగ్గర బంధువులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.