దుబాయ్: భార్యా, పిల్లలతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ భారత పారిశ్రామికవేత్త కుటుంబానికి సరికొత్త అనుభవం ఎదురైంది. ఓ హోటల్ లిఫ్ట్‌లో పారిశ్రామికవేత్త తన కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఏకంగా దుబాయ్ రాజు ప్రత్యక్షమయ్యాడు. అంతేగాక, ఆ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి రాజు ఫొటోలు దిగాడు. ఆ కొద్ది నిమిషాలు వారితో సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత లిఫ్ట్ దిగి వెళ్లిపోయాడు. ఈ అనూహ్య ఘటన ఆ పారిశ్రామికవేత్త కుటుంబానికి ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన వెల్త్ రిసెర్చ్ ఏజెన్సీ ‘హరూన్ ఇండియా’ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన అనస్ రెహ్మాన్ జునైద్ ఇటీవల తన కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ‘అట్లాంటిస్ ది రాయల్’ అనే ప్రముఖ హోటల్లో దిగారు. గత శనివారం అనస్ రెహ్మాన్ తన కుటుంబంతో కలిసి లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా.. లిఫ్ట్ 22వ ఫ్లోర్‌కు చేరుకోగానే వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే ఘటన చోటుచేసుకుంది.
యూఏఈ ప్రధాన మంత్రి, ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన పరివారంతో కలిసి లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు. ఇది కలా.. నిజమా..? అని పారిశ్రామికవేత్త కుటుంబం ఆశ్యర్చపోతుండగానే.. రాజు ఆ పారిశ్రామికవేత్త 10 ఏళ్ల కుమార్తె భుజంపై చేయివేసి ‘నేనెవరో తెలుసా..?’ అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కుటుంబంతో సరదాగా ముచ్చటించాడు. ‘ఎక్కడి నుంచి వచ్చారు..? ఏం చేస్తుంటారు..?’ అని ఆరా తీశాడు. ఆ తర్వాత తాను దిగాల్సిన ఫ్లోర్ రాగానే దిగి వెళ్లిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన అనుభవాలను హరూన్ ఇండియా ఎండీ అనస్ రెహ్మాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దుబాయ్ రాజును కలిసిన లిఫ్ట్ నుంచి దిగగానే తన భార్య ఆ లిఫ్ట్‌ను ఫొటో తీసుకున్నదని, ‘ప్రపంచంలో తనకు ఇదే అత్యంత ఇష్టమైన లిఫ్ట్’ అనే క్యాప్షన్‌తో ఇంటర్నెట్లో పోస్ట్ చేసిందని చెప్పాడు. తన కొడుకు సాధారణంగా ఫొటోలు తీసేటప్పుడు నవ్వడని, కానీ దుబాయ్ రాజుతో దిగిన ఫొటోలో వాడు నవ్వుతూ కనిపించాడని తెలిపాడు.